గూగుల్ పై రూ. 1,338 కోట్ల జరిమానాను భారత్ విధించగానే.. ఆ టెక్ దిగ్గజం దానిపై స్పందించింది. ఈ ఫైన్‌తో భారత వినియోగదారులే నష్టపోతారని పేర్కొంది. భారత్‌లో వ్యాపారాలు దెబ్బ తింటాయని వివరించింది. గూగుల్ పై జరిమానా విధిస్తూ సీసీఐ కీలక విషయాలను ప్రస్తావించింది. గూగుల్ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: భారత యాంటీ ట్రస్ట్ వాచ్‌డాగ్ తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం టెక్ దిగ్గజం గూగుల్ స్పందించింది. సహజమైన, ఆరోగ్యకరమైన పోటీకి భిన్నంగా గూగుల్ వ్యవహరిస్తున్నదని, యాంటీ కాంపిటీటివ్‌కు పాల్పడుతున్నదని కాంపిటీషన్ కమిషన్ ఆప్ ఇండియా (సీసీఐ) రూ. 1,338 కోట్ల ఫైన్ వేసింది. ఈ జరిమానాపై స్పందిస్తూ ఇది భారత వినియోగదారులకే సమస్యను తెచ్చి పెడుతుందని వివరించింది. అంతేకాదు, భారత్‌లో వ్యాపారాలపైనా ప్రభావం వేస్తుందని పేర్కొంది.
ఆన్‌లైన్ సెర్చ్ యాప్, ఆండ్రాయిడ్ యాప్ స్టోర్‌లో తన అప్లికేషన్‌లలో గూగుల్ సరిగా వ్యవహరించడం లేదని, గుత్తాధిపత్యానికి పాల్పడుతున్నదని సీసీఐ పేర్కొంది. ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి మొబైల్స్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్, యూట్యూబ్‌లను కలిగి ఉండేలా నడుచుకుంటున్నదని వివరించింది. ఇది సహజమైన పోటీ వాతావరణాన్ని భంగం చేస్తున్నదని తెలిపింది.
ఫైన్ వేయడంతోపాటు సీసీఐ మరికొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ ఫోన్ తయారీదారులతో గూగుల్ రెవెన్యూ షేర్ చేసుకునే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఆదేశించింది.
Also Read: గూగుల్‌కు రూ.1,337 కోట్ల జరిమానా విధించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా...కారణం ఇదే..
సీసీఐ నిర్ణయం భారత వినియోగదారులకు, వ్యాపారాలకు పెద్ద ఎదురు దెబ్బ అని గూగుల్ అభిప్రాయపడింది. అంతేకాదు, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫీచర్లను నమ్మిన భారతీయులకు తీవ్రమైన సెక్యూరిటీ రిస్క్స్‌ను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని తెలిపింది.అంతేకాదు, భారతీయులకు మొబైల్ డివైజుల ధరలూ పెరుగవచ్చు అని పేర్కొంది. అలాగే, తమ తదుపరి నిర్ణయాన్ని సమీక్షించి తీసుకుంటామని వివరించింది.
సీసీఐ గురువారం తన ప్రకటనలో కీలక విషయాలను ప్రస్తావించింది. మార్కెట్లు పోటీ మెరిట్ ఆధారంగా ఉండాలని తెలిపింది. అంతేకానీ, డామినెంట్ ప్లేయర్లు వాటి ఆధిపత్యాన్ని ప్రదర్శించి మెరిట్ కాంపిటీషన్‌ను మరుగున పరచవద్దని సూచించింది.
గూగుల్ పై సీసీఐ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా స్మార్ట్ టీవీ మార్కెట్‌లో దాని వ్యాపారాలను, అందులో ముందుగానే సెటింగ్‌తో వచ్చే ఇన్ యాప్ పేమెంట్ సిస్టమ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.
Also Read: జిమెయిల్ కి పోటీగా యాహూ యాప్ కొత్త వెర్షన్.. 1టిబి స్టోరేజ్ ఫ్రీ..
ఇద్దరు ఇండియన్ యాంటీట్రస్ట్ రీసెర్చ్ అసోసియేట్లు, ఒక లా స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో 2019లో ఆండ్రాయిడ్ సంబంధ దర్యాప్తు మొదలైంది. యూరప్‌లో గూగుల్ ఎదుర్కొంటున్న కేసుల తరహాలోనే మన దేశంలోనూ ఈ కేసును ఎదుర్కొంటున్నది. ఆండ్రాయిడ్ డివైజుల్లో తమ యాప్‌లను ప్రీ ఇన్‌స్టాల్ (ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంచడం) చేయడానికి తయారీదారులను బలవంతం పెట్టిన కారణంగా యూరప్‌లో ఈ సంస్థపై 5 బిలియన్ డార్ల జరిమానా పడింది.
ఇండియాలోనూ ఇలాంటి ఆదేశాలే వచ్చాయి. స్మార్ట్ ఫోన్‌లలో గూగుల మ్యాప్స్, జీమెయిల్ వంటి ప్రీ ఇన్‌స్టాల్డ్ అప్లికేషన్లను యూజర్లు అన్‌ఇన్‌స్టాల్ (తొలగించుకునే అవకాశం) చేయకుండా యూజర్ల చేతులను కట్టివేయొద్దని గురువారం సీసీఐ ఆదేశించింది.
అంతేకదు, ఫోన్‌ను మొదటి సారి సెట్ చేస్తున్నప్పుడు అందులో వారికి ఇష్టమైన సెర్చ్ ఇంజిన్, ఇతర సేవలను ఎంచుకునే వెసులుబాటును యూజర్లకు ఇవ్వాలని గూగుల్‌ను ఆదేశించింది.
