మహాత్మా గాంధీకి డిగ్రీ లేదన్న జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలపై గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీ విద్యార్హతలను ఆయన ఏకరువు పెట్టారు. లండన్ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో లా డిగ్రీ పొందాడని వివరించారు. 

ముంబయి: మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ.. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జాతి పిత మహాత్మా గాంధీకి ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని పేర్కొనడాన్ని తప్పుపట్టారు. అంతేకాదు, ఆయన విద్యార్హతలను వివరిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాపై విమర్శలు చేశారు. ట్విట్టర్‌లో తుషార్ గాంధీ ఈ మేరకు వివరణ ఇచ్చారు.

‘మోహన్ దాస్ కరంచంద్ గాంధీ రెండు మెట్రిక్‌లు పాస్ అయ్యారు. ఒకటి రాజ్‌కోట్‌లోని అల్ఫ్రెడ్ హై స్కూల్, రెండు దీనికి సమానమైన బ్రిటీష్ మెట్రిక్యులేషన్. ఆయన చదివి, పరీక్షలు రాసి ఉత్తీర్ణులై లండన్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ లా కాలేజీ ఇన్నర్ టెంపుల్ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. అదే సమయంలో ఆయన రెండు డిప్లొమాలు పొందారు. ఒకటి లాటిన్, మరొకటి ఫ్రెంచ్‌లో డిప్లొమా పొందారు. ఈ సమాచారాన్ని జమ్ము కశ్మీర్ డిప్యూటీ గవర్నర్‌కు అవగాహన కల్పించడానికి జారీ చేయడమైనది’ అని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.

Also Read: ఒక్క ఓటు కోసం ప్రత్యేక విమానం.. కుమారుడి పెళ్లి జరుగుతున్నా వచ్చి ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యే..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌లో జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం ఎంకే గాంధీ విద్యార్హతల గురించి మాట్లాడారు. ‘మహాత్మా గాంధీకి ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని మీకు తెలుసా? మహాత్మా గాంధీకి లా డిగ్రీ ఉన్నదని మనలో చాలా మంది ఆలోచిస్తుంటాం. కానీ, ఆయన లేదు. ఆయనకు ఉన్న విద్యార్హత కేవలం హై స్కూల్ డిప్లొమా. లా ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించాడు. అంతే. ఆయనకు లా డిగ్రీ లేదు’ అని మనోజ్ సిన్హా తెలిపారు.

Scroll to load tweet…

మనోజ్ సిన్హా వ్యాఖ్యలను తుషార్ గాంధీ తప్పుపట్టారు. ఆయన కోసం బాపు ఆత్మకథను జమ్ము రాజ్‌భవన్‌కు పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆత్మకథను చదివి ఆయన సొంతంగా తనను తాను ఎడ్యుకేట్ చేసుకుంటాడని ఆశిస్తున్నట్టు వివరించారు.