అమరావతి (మహారాష్ట్ర): మహారాష్ట్ర అటవీ శాఖ అధికారి దీపాలీ చవాన్ ఆత్మహత్య కేసులో ఆ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ రెడ్డిని బుధవారం రాత్రి అరెస్టు చేశారు. దీపాలీ చవాన్ ఆత్మహత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

హరిసాల్ రేంజ్ అటవీ అధికారిగా పనిచేస్తున్న దీపాలీని ఆమె పైఅధికారి వినోద్ శివకుమార్ విధి నిర్వహణలో వివిధ రకాలుగా వేధించాడని, ఆ విషయంపై ఫిర్యాదు చేసినా కూడా సంబంధిత శాఖ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పట్టించుకోలేదని దీపాలీ తన సూసైడ్ నోట్ లో ఆరోపించారు. 

Also Read: లైంగిక వేధింపులతో చిత్రహింసలు: లేడీ సింగమ్ ఆత్మహత్య

ఆ ఫిర్యాదుపై శ్రీనివాస్ రెడ్డి ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో ఆమెపై వేధింపులు కొనసాగుతూ వచ్చాయి. ఆ వేధింపులు తట్టుకోలేక దీపాలి మార్చి 25వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ అయ్యారు 

ప్రభుత్వం అనుమతి తీసుకుని శ్రీనివాస్ రెడ్డిని అమరావతి రూరల్ పోలీసులు నాగపూర్ లో అరెస్టు చేశారు. 

అటవీ మాఫియా ఆట కట్టించడంలో విశేషమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన దీపాలీ చవాన్ మహారాష్ట్ర లేడీ సింగమ్ గా పేరు గాంచారు. ఆమె భర్త రాజేష్ మొహితే చిఖల్ దారలో ట్రెజరీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. తన తల్లి తన సొంత గ్రామం సతారాకు వెళ్లిపోయిన సమయంలో దీపాలీ చవాన్ నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు.