అమరావతి: మహారాష్ట్ర లేడీ సింగమ్ గా పేరు గాంచిన అటవీ శాఖ అధికారి దీపాలీ చవాన్ (28) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. భారత అటవీ శాఖ (ఐఎఫ్ఎస్) అధికారి ఒకతను తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని, అతని చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానని ఆమె సూసైడ్ నోట్ లో రేాసింది. ఆమె రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 

మెల్గాట్ టైగర్ రిజర్వ్ (ఎంటీఆర్) సమీపంలోని హరిపాల్ గ్రామంలో గల తన అధికారిక నివాసంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆమె సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలోనే ఆమె మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయారు. 

అటవీ మాఫియా ఆట కట్టించడంలో విశేషమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన దీపాలీ చవాన్ లేడీ సింగంగా పేరు పొందురాు. ఆమె భర్త రాజేష్ మొహితే చిఖల్ దారలో ట్రెజరీ ఆఫీసర్.  తన తల్లి తన సొంత గ్రామం సతారాకు వెళ్లిపోయిన సమయంలో దీపాలీ తీవ్రమైన చర్యకు ఒడిగట్టింది. 

దీపాలీ తన సూసైడ్ నోట్ లో ప్రస్తావించిన అటవీశాఖ అధికారి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్ ను పోలీసులు నాగపూర్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అమరావతికి తరలించారు. శివకుమార్ తనను లైంగికంగా, మానసికంగా వేధించిన తీరును దీపాలీ చవాన్ తన సూసైడ్ నోట్ లో రాశారు. 

శివకుమార్ మీద ఆయన సీనియర్ అధికారి, ఎంటీఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకులేదని ఆమె సూసైడ్ నోట్ లో రాసిది.  గర్భవతి అయిన దీపాలీని ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు గస్తీ నిర్వహించాలని చెప్పి బలవంతంగా శివకుమార్ అడవిలోకి తీసుకుని వెళ్లాడని చెబుతున్నారు. గర్భవతి అని తెలిసి కూడా కిలోమీటర్ల కొద్దీ నడిపించాడని సమాచారం గర్భస్రావం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైందని చెబుతున్నారు. 

అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని, నిందితులను వదిలిపెట్టబోమని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. నిందితుడు శివకుమార్ ను సస్పెండ్ చేస్తూ అటవీ శాఖ ముఖ్య కన్జర్వేటర్ అరవింద్ ఆప్టే ఆదేశాలు జారీ చేశారు ఎంటీఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. శ్రీనివాస రెడ్డి బాధ్యతలను మరొకరికి అప్పగించినట్లు ఆప్టే తెలిపారు.