భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఓ ఐపీఎస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఈ బిల్లు విరుద్ధంగా ఉందంటూ ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా చేశారు.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అబ్దుర్ రహమాన్ ప్రస్తుతం ముంబైలో విధులు నిర్వర్తిస్తున్నారు. లోక్‌సభలో ఆమోదం అనంతరం.. రాజ్యసభలోనూ ఈ బిల్లును ఎంపీలు ఆమోదించడంతో రహమాన్ మనస్తాపం చెందారు.

Also Read:పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదమే తరువాయి

రాజ్యాంగ ప్రాథమిక లక్షణానికి పౌరసత్వ సవరణ బిల్లు 2019 పూర్తి వ్యతిరేకంగా ఉందని.. అలాగే పౌరుల హక్కులకు విఘాతం కలిగించేదిగా ఉందని రహమాన్ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును ఖండిస్తూ.. తాను తన పదవికి రాజీనామా చేస్తున్నానని, రేపటి నుంచి విధులకు హాజరుకానని ట్విట్టర్‌లో రాజీనామా లేఖను పోస్ట్ చేశారు.

భారత లౌకికవాద భావనకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును ప్రజాస్వామ్యవాదులు సైతం వ్యతిరేకించాలని రహమాన్ విజ్ఞప్తి చేశారు. పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.

సభలో 230 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. ఈ బిల్లుకు అనుకూలంగా  125 మంది, వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. దీంతో పార్లమెంట్‌లోని ఉభయసభల్లో పౌరసత్వ బిల్లు ఆమోదం పొందినట్లయ్యింది. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

Also Read:పౌరసత్వ సవరణ బిల్లుపై కమల్ హాసన్ ఆగ్రహం: రోగంలేని వ్యక్తికి ఆపరేషన్ అంటూ.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిక్కు మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి.