మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేనకు బయటినుంచి మద్ధతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరో గంటన్నరలో గవర్నర్ డెడ్‌లైన్ ముగియనుండటంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో శివసేనకు బయటి నుంచి మద్ధతు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ నేతలతో భేటీ జరుగుతున్నట్లుగానే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. సోనియా గాంధీతో ఫోన్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

అన్ని అంశాలను చర్చించిన మీదట మిగిలిన సమాచారం తెలియజేస్తామని ఉద్ధవ్‌కు సోనియా తెలిపారు. మొత్తం మీద వైరి పక్షాలుగా ఉన్న శివసేన, కాంగ్రెస్ కలిసి పనిచేయబోతుండటం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

Also Read:కాంగ్రెస్ తో శివసేన: ఈ నాటి ఈ 'మహా' బంధమేనాటిదో...

అతిత్వరలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియార్‌తో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకున్న బలాన్ని, సంసిద్ధతను ఉద్ధవ్ గవర్నర్‌కు తెలిపే అవకాశాలున్నాయి.

ప్రస్తుతానికి ఎన్సీపీ, శివసేన ప్రభుత్వంలో భాగం పంచుకోవడానికి సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్ విషయంపైనా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని మాత్రం గట్టిగా కోరుతోంది.

మంత్రి పదవుల విషయానికి వస్తే 16 శివసేనకు, 14 ఎన్సీపీకి, కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి శరద్‌ పవార్ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. 

సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ హిందుత్వ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకున్న శివసేనతో కలవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే శివసేన గతంలో కూడా చాల సార్లు కాంగ్రెస్ కి మద్దతు తెలిపింది. కలిసి పొత్తు పెట్టుకోకపోయినా, శివసేన కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది.

Also Read:మహా మలుపు: పవార్ షరతు తలొగ్గిన శివసేన, కేంద్ర మంత్రి రాజీనామా

తొలిసారిగా 1967 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థికి శివసేన మద్దతు ప్రకటించింది. పార్టీ ఏర్పాటు చేసి కేవలం ఒక్క సంవత్సరమే అవ్వడం, పార్టీ అప్పటి సిద్ధాంతం మరాఠాలకు పెద్ద పీట  వెయ్యడమే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. 

ఆ తరువాత 1975లో బాల్ ఠాక్రే ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని సమర్థిస్తూ దానికి మద్దతు పలికాడు. నాయకత్వం అనేది ప్రేమతో కూడిన నియంతృత్వంతో ఉండాలని పదే పదే బల్ ఠాక్రే అనేవాడు. అందుకోసమే ఇందిరా గాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితిని సమర్థించాడు.