ముంబై: శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పెట్టిన షరతుకు శివసేన తలొగ్గింది. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ నుంచి తప్పుకుంటేనే రాష్ట్రంలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తామని పవార్ స్పష్టం చేశారు. దీంతో శివసేన ఎన్డీఎ నుంచి తప్పుకుంది. 

శివసేన పార్లమెంటు సభ్యుడు అర్వింద్ సావంత్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఎ ప్రభుత్వంలో ఆయన భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మంత్రిగా పనిచేస్తున్నారు.

ఎన్సీపి మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సోమవారం గవర్నర్ కు చెప్పే అవకాశం ఉంది. బిజెపితో అన్ని రకాలైన సంబంధాలను తెంచుకోవాలని ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ ఆదివారంనాడు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బిజెపితో శివసేన తెగదెంపులు చేసుకుంది.

తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బిజెపి గవర్నర్ తో చెప్పిన తర్వాత రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఎన్సీపీకి 54 మంది, కాంగ్రెసుకు 44 మంది శాసనసభ్యులున్నారు. ఈ రెండు పార్టీల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైనట్లు అర్థమవుతోంది. 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెసు పార్టీ సోమవారం ఉదయం పది గంటలకు సమావేశమవుతోంది. అధిష్టానం ఆదేశాల మేరకు తాము ముందుకు అడుగులు వేస్తామని కాంగ్రెసు నేత మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.