మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలో రోజు రోజుకు మారిపోతున్నాయి. ఉద్దవ్ ఠాక్రే బలం తగ్గిపోతోంది. తాజాగా థానే ప్రాంతానికి చెందిన 66 మంది కార్పొరేటర్లు సీఎం షిండే గూటికి చేరారు. అలాగే మాజీ ఎంపీ కూడా శివసేనకు రాజీనామా చేసి కొత్త వర్గంలో జాయిన్ అయ్యారు.
మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. థానేకు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరారు. శివసేన ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో ఉండగా.. మరొకటి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో కొనసాగుతోంది. ఇటీవల షిండే పార్టీపై తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
గత కొంత కాలంగా ఉద్దవ్ ఠాక్రేపై అసంతృప్తిగా ఎమ్మెల్యేలను తీసుకొని ఏక్ నాథ్ షిండే పార్టీపై తిరుగుబాటు చేశారు. వారందరినీ మొదట గుజరాత్ కు, తరువాత అస్సాంకు తరలించారు. అక్కడ ఓ లక్సరీ రిసార్ట్ లో వారందరినీ ఉంచారు. అయితే తరువాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఉద్దవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే బాధ్యతలు చేపడుతారని అంతా భావించారు. కానీ ఆకస్మాత్తుగా షిండేనే సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పరిణామాలు కొంతమంది బీజేపీ నాయకులను ఇబ్బంది పెట్టింది. అయితే షిండే శిబిరాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఉద్ధవ్ నేతృత్వంలోని సేనలో మిగిలి ఉన్న నాయకులను రప్పించడానికి బీజేపీ ఎన్నుకున్న తెలివైన మార్గం ఇది అని రాజకీయ విశ్లేకులు పేర్కొంటున్నారు.
రైతుగా మారిన రెబల్ ఎమ్మెల్యే.. లగ్జరీ హోటల్ నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి.. !
నేడు చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే బీజేపీ వ్యూహం విజయవంతమవుతోందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు షిండే వద్దకు చేరిన కార్పొరేటర్లు అంతా థానే ప్రాంతానికి చెందిన వారే. ఈ ప్రాంతం ప్రస్తుత సీఎంకు ఎప్పటి నుంచో కంచుకోటగా ఉంది. కాబట్టి కార్పొరేటర్లు ఆయనతో కలిసిరావడం పెద్దగా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 40 మంది షిండేకు మద్దతు ప్రకటించారు. తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు షిండేకు కేవలం 39 మందే మద్దతు ఇచ్చారు. తరువాత మరో ఎమ్మెల్యే ఉద్దవ్ ఠాక్రే వర్గం నుంచి షిండే వర్గంలోకి చేరిపోయారు. కాగా నేడు శివసేన మాజీ ఎంపీ కూడా పార్టీని వీడారు. అమరావతి నుంచి గతంలో ఎంపీగా పని చేసిన ఆనందరావు విఠోబా అడ్సుల్ శివ సేనకు రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం లోక్ సభలో శివసేనకు 18 మంది ఎంపీలు ఉన్నారు. అయితే వారిలో ఇద్దరు కూడా షిండే వైపు మొగ్గు చూపారు.
Bakrid festival: బక్రీద్ కు పశువులను బలి ఇవ్వకండి : కర్నాటక మంత్రి
అద్సుల్ పార్టీకి రాజీనామా చేయడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. అతడు ఈడీకి భయపడ్డారని చెప్పారు. ‘‘ ఆనంద్ రావు తన రాజీనామాను ఇచ్చారు, ఆయనకు వ్యతిరేకంగా ఈడీ వెళ్తోందని నాకు తెలిసింది. అతడి ఇంటిపై దాడులు జరిగాయి. ఇలాంటి ఒత్తిడి చాలా మందిపై జరుగుతోంది. ’’ అని సంజయ్ రౌత్ వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.
