మహారాష్ట్రలో రెబల్ ఎమ్మెల్యేలు హోటల్స్ వదిలి ఇటీవలే సొంతింటికి తిరిగి వెళ్లారు. ఇందులో పాల్ఘడ్ ఎమ్మెల్యే వంగ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయన ఇంటికే కాదు.. అటు నుంచి తన వ్యవసాయ క్షేత్రానికి కూడా వెళ్లాడు. ఔను.. వర్షాకాలం.. పంట వేసే సమయానికి ఆయన ఇంటికి వెళ్లడంతో సాగు పనుల్లో మునిగిపోయాడు. 

ముంబయి: మొన్నటిదాకా వారు మహారాష్ట్ర రసవత్తర రాజకీయంలో కేంద్ర బిందువులు. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాట చేసి దేశం దృష్టిని తమ వైపు తిప్పుకున్న రెబల్ ఎమ్మెల్యేలు. ఏక్‌నాథ్ షిండే నాయకత్వానికి జిందాబాద్ కొడుతూ గుజరాత్ అటు నుంచి అసోం.. అక్కడి నుంచి గోవా హోటల్‌లకు మారుస్తూ రాష్ట్ర రాజకీయాను శాసించారు. ఎట్టకేలకు ఏక్‌నాథ్ షిండే సీఎం అయ్యారు. ఆయనకు కంఫర్టబుల్ మెజార్టీ ఉన్నది. ఇప్పుడు దీర్ఘకాలం ఆ లగ్జరీ హోటళ్లలో గడిపిన రెబల్ ఎమ్మెల్యేలు ఇంటి దారి పట్టారు.

ఇందులో పాల్ఘడ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగ కూడా ఉన్నారు. ఆయన ఇటీవలే హోటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చీ రాగానే వర్షాకాలం కావడం.. వర్షాలు కురుస్తుండటంతో వెంటనే వ్యవసాయంలోకి దిగిపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించిన ఆ రెబల్ ఎమ్మెల్యే ఇప్పుడు పొలంలోకి అడుగుపెట్టారు.

ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగకు తలసారిలో పంట పొలాలు ఉన్నాయి. అక్కడే ఆయన తల్లి, తన భార్య, 14 ఏళ్ల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. పాల్ఘడ్‌లో వర్షాలు సాగుకు అనుకూలంగా కురుస్తున్నాయి. దీంతో ఆయన కూడా వ్యవసాయ క్షేత్రంలో దర్శనం ఇచ్చారు.

శరద్ పవార్ నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో ఉద్ధవ్ ఠాక్రే కూటమిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వంగ శ్రీనివాస్ ఏక్‌నాథ్ షిండేతో చేతులు కలిపారు. శివసేన హిందూత్వ భావజాలం నుంచి దూరం జరుగుతుంటే.. ఎన్సీపీ మాత్రం ప్రభుత్వ ఫలాలను రాబట్టుకునే పనిలో పడిందని ఆయన ఆరోపించారు. కాబట్టి, తాను సీఎం షిండే వెంట వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కానీ, ఇప్పటికీ తాను మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గౌరవిస్తానని వివరించారు.

సీఎం కుర్చీలో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నప్పటికీ.. ప్రభుత్వాన్ని ఎన్సీపీ నడిపిందని, అందుకే ఎమ్మెల్యేలంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని ఆయన ఆరోపించారు. అందుకే తాము తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని వివరించారు. అయినప్పటికీ రెబల్ ఎమ్మెల్యేలు అందరికీ ఠాక్రే అంటే అసమాన గౌరవం ఉన్నదని తెలిపారు.