మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. శివసేనకు ముందు మద్ధతు ప్రకటించిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట మార్చడం.. రెండు రోజులు గడువు కావాలన్న శివసేన విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించడం చకచకా జరిగిపోయాయి.

అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనకు ఇచ్చిన గడువు ముగిసిన కాసేపటికే అసెంబ్లీ ఎన్నికల్లో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఆహ్వానించారు. ఇందుకు 24 గంటలు సమయం ఇచ్చారు.

తొలుత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని గవర్నర్ ఆహ్వానించగా అది తమ వల్ల కాదని ఆ పార్టీ తెలిపింది. దీంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను గవర్నర్ ఆహ్వానించారు. ఇందుకు సోమవారం రాత్రి 7.30 వరకు గడువు విధించారు. అయితే ఇందుకు ఆ పార్టీ మరో రెండు రోజులు గడువు కోరడంతో ఆయన తిరస్కరించారు.

Also Read:మహా మలుపు: పవార్ షరతు తలొగ్గిన శివసేన, కేంద్ర మంత్రి రాజీనామా

దీంతో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం పలికారు. ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్ధతు అవసరం.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, శివసేనల మద్ధతుతో ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక మంగళవారం మరేదైనా జరుగుతుందా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

శివసేనకు మద్ధతుపై తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గవర్నర్ భగత్‌సింగ్‌తో శివసేన నేత ఆధిత్య థాక్రే భేటీ అయ్యారు.

ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత, సంఖ్యా బలం తదితర విషయాలను ఆదిత్య.. గవర్నర్‌కు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు మరో రెండు రోజులు గడువు కోరామని కానీ గవర్నర్ తిరస్కరించారని ఆదిత్య తెలిపారు.

Also Read:‘‘మహా’’ సంక్షోభం: శివసేనకు కాంగ్రెస్ చివరి ఘడియ షాక్

కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో చర్చలు జరిపామని, తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేనకు బయటినుంచి మద్ధతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో శివసేనకు బయటి నుంచి మద్ధతు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ నేతలతో భేటీ జరుగుతున్నట్లుగానే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. సోనియా గాంధీతో ఫోన్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

అన్ని అంశాలను చర్చించిన మీదట మిగిలిన సమాచారం తెలియజేస్తామని ఉద్ధవ్‌కు సోనియా తెలిపారు. మొత్తం మీద వైరి పక్షాలుగా ఉన్న శివసేన, కాంగ్రెస్ కలిసి పనిచేయబోతుండటం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.