హైదరాబాద్: ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ హెటిరో సంస్థ రూపొందించిన రెమ్డిసివియర్ డ్రగ్... కోవిఫర్ ను దేశంలోని ఐదు రాష్ట్రాలకు ముందుగా పంపారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నారు.

దేశంలోని ముంబై, ఢిల్లీ నగరాలతో పాటు తమిళనాడు, గుజరాత్, హైద్రాబాద్ నగరాలకు 20 వేల ఇంజక్షన్లను అందించినట్టుగా హెటిరో తెలిపింది. రెండో విడత కింద కోల్ కత్తా, ఇండోర్ భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ విజయవాడ, కొచ్చి, త్రివేండ్రం, పణాజీ నగరాలకు పంపనున్నట్టుగా పేర్కొంది.

‌హైద‌రాబాద్‌లోని సుప్రసిద్ధ జెనెరిక్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ హెటిరో సంస్థ  రెమ్డిసివిర్‌ ఔషధాన్ని ‘కోవిఫర్‌’ ఇంజెక్షన్ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న‌ట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

రెమ్డిసివిర్‌` ఔష‌ధాన్ని ల్యాబ్‌ల‌లో ప‌రీక్ష చేసిన అనంత‌రం పాజిటివ్ రోగులుగా గుర్తించ‌బ‌డిన చిన్నారులు, యువత, కోవిడ్ ల‌క్షణాల‌తో ఆస్పత్రి పాలైన వారి చికిత్స కోసం వినియోగించ‌వ‌చ్చు. కోవిఫ‌ర్ (రెమ్డిసివిర్‌) 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. 

ఇక 100 మిల్లీగ్రాముల రెమ్డిసివి‌ర్ ఔష‌ధానికి 5,400 రూపాయ‌లు ఖర్చవుతుందని హెటిరో సంస్థ పేర్కొంది. వ‌చ్చే మూడు, నాలుగు వారాల్లో ల‌క్ష డోసుల‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని కంపెనీ ల‌క్ష్యంగా పెట్టుకుంది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని కంపెనీలో ఈ ఔష‌ధాన్ని త‌యారు చేస్తున్నట్లు వెల్ల‌డించింది. ఈ మందు కేవ‌లం వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికే ల‌భిస్తుంద‌న్నారు.