దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కోవిడ్ 19 విలయ తాండవం కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 466 కొత్త కేసులు నమోదవ్వడంతో మొత్తం బాధితుల సంఖ్య 4,666కు చేరుకుంది.

ఈ రోజు తొమ్మిది మంది మరణించారు. ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో కోవిడ్ 19 స్వైర విహారం చేస్తోంది. సోమవారం ఒక్కరోజే ఇక్కడ 30 కేసులు నమోదుకోవడంతో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Also Read:59 జిల్లాల్లో 14 రోజులుగా కరోనా కేసులు లేవు: కేంద్ర ఆరోగ్య శాఖ

ఈ కేసులతో కలిపి ఇక్కడ మొత్తం బాధితుల సంఖ్య 168కి చేరుకోగా, ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ధారావిలో నమోదైన కేసుల్లో ఎనిమిది మంది మహిళలు ఉండటం గమనార్హం.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3032కి చేరింది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 308 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఏడుగురు కోవిడ్ 19తో మరణించడంతో నగరంలో మొత్తం మృతుల సంఖ్య 139కి పెరిగింది.

Also Read:దేశంలో కోరలు చాస్తోన్న కరోనా: మహమ్మారి నుంచి గట్టెక్కిన రెండు రాష్ట్రాలు

కాగా గత 24 గంటల్లో దేశంలో 1.553 కొత్త కేసులు నమోదవ్వగా.. 36 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 17,615కు చేరగా, 543 మంది మృతి చెందారు.

ముంబై, పుణే, ఇండోర్, జైపూర్, కోల్‌కతా పట్టణాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. అలాగే దేశంలోని 59 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.