కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తొలిదశలో ఏప్రిల్ 14 వరకు ప్రధాని మోడీ లాక్‌డౌన్ విధించారు. అయితే అప్పటికీ పరిస్ధితిలో మార్పు రాకపోవడంతో దానిని మే 3 వరకు పొడిగిస్తూ మరోసారి ప్రకటించారు.

ఈ క్రమంలో లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. 20 నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వలు ఎలాంటి సడలింపులు ఉండవని తేల్చి  చెప్పేశాయి.

Also Read:59 జిల్లాల్లో 14 రోజులుగా కరోనా కేసులు లేవు: కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలోని అన్ని రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా నుంచి రెండు రాష్ట్రాలు మాత్రం సురక్షితంగా బయటపడ్డాయి. అందులో ఒకటి మణిపూర్ కాగా.. రెండోది గోవా. తమ రాష్ట్రం కరోనా ఫ్రీ అని ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకున్నాయి.

తమ రాష్ట్రంలో కరోనా సోకిన ఇద్దరు బాధితులు పూర్తిగా కోలుకున్నట్లు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రకటించారు. తమ రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు లేవని ఆయన సోమవారం ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Also Readజర్నలిస్టులకు కరోనా దెబ్బ: ముంబైలో 53 మందికి కరోనా

తమ దగ్గర వైద్య సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రజల సహకారంతోనే దీనిని సాధించామని, అలాగే లాక్‌డౌన్ కూడా కఠినంగా అమలు చేయడం మరో కారణమని బీరేన్ తెలిపారు. అటు గోవా కూడా కరోనా నుంచి విముక్తి పొందినట్లు ప్రకటించుకుంది.

రాష్ట్రంలో కరోనా సోకిన ఏడుగురు రోగులు కోలుకున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ సోమవారం  ప్రకటించారు. ఏప్రిల్ 3 తర్వాత రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి ప్రమోద్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు విధించిన లాక్‌డౌన్ విధిగా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు.