కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మహారాష్ట్ర బాలల హక్కుల  కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల రాహుల్ దళితుల పట్ల   బిజెపి, ఆర్ఎస్ఎస్ లు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శిస్తూ ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు ఓ వీడియోను జత చేశాడు. దీనిపై అమోల్ జాదవ్ అనే ముంబై వాసి బాలల హక్కుల  కమీషన్ కి రాహుల్ పై ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమీషన్ రాహుల్ గాంధీతో పాటు ట్విట్టర్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. 

రాహుల గాంధీ ఇటీవల వైరల్ గా మారిన ఓ వీడియోను బిజెపి, ఆర్ఎస్ఎస్ లను విమర్శించడానికి వాడారు. జలగావ్ జిల్లాలోని వాకిడి గ్రామంలో ఇద్దరు దళిత విద్యార్థులు ఉన్నత కులస్థులు బట్టలూడదీసి కొట్టారు. అగ్ర కులానికి చెందిన వారి బావిలో దిగినందుకు వీరినిలా బట్టలూడదీసి కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో రాహుల్ ఓ ట్వీట్ కు జతగా ఈ వీడియో వాడారు.

అయితే ఇలా బాధిత చిన్నారుల గుర్తింపు వివరాలను వెల్లడించినందుకు ఆయనకు బాలల కమీషన్ నోటీసులు జారీ చేసింది.  బాలల నేర న్యాయ చట్టం 2015, లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం 2012 ప్రకారం ఎందుకు చర్య తీసుకోరాదో సమాధానం చెప్పాలని కోరింది. 10 రోజుల్లోగా తన సమాధానాన్ని  సమర్పించాలని కమీషన్ గడువు విధించింది.