మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన వర్గం ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించడంతో మొదలైన రాజకీయ అనిశ్చితి మొన్న కమల్ నాథ్ రాజీనామా చేయడంతో ఒకింత మాత్రమే తీరింది. 

మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై కొద్దిసేపు సందిగ్ధత నడిచింది. నరేంద్ర సింగ్ తోమర్ వైపు కొద్దిసేపు మొగ్గు చూపగా, మరి కొద్దీ సేపు నరోత్తం మిశ్ర పేరు వినపడ్డది. కానీ ఎట్టకేలకు అందరూ ఊహించినట్టు సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహన్ నాలుగవసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. 

నిన్న రాత్రి ఆయన ప్రమాణస్వీకారం చేయగానే... వెంటనే రంగంలోకి దిగారు. కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దానికన్నా ముందు ప్రధాని నరేంద్ర మోడీ శివరాజ్ సింగ్ చౌహన్ కి శుభాకాంక్షలు తెలిపారు. దానికి ధన్యవాదాలు తెలుపుతూ... కరోనా ను ఎదుర్కోవడం ఇప్పుడు తన ప్రాథమిక కర్తవ్యం అని తెలిపారు. 

ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆయన ప్రమాణస్వీకారం చేసిన తరువాత కొరోనాను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోవడంతోపాటు.... ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే ఆస్కారముందో కూడా  తెలుసుకున్నారు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఎవరితో కరచాలనాలూ గని పూల బొకేలు కానీ కరోనా వైరస్ దృష్ట్యా స్వీకరించలేదు. అక్కడున్న కొద్దీ మందికి ధన్యవాదాలు తెలిపి కరోనా ను అందరం కలిసి ఎదుర్కొందాం అని పిలుపునిచ్చారు. 

ఇకపోతే భారతవ్యాప్తంగా కరోనా పంజా విసురుతూనే ఉంది. దేశంలో  కరోనా మరణాలు పదికి చేరుకున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 69 ఏళ్ల వృద్ధుడు వైరస్ సోకి మరణించాడు. మార్చి 15న అమెరికా నుంచి వచ్చిన ఆ వృద్ధుడు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.

Also Read:కోల్ కతాలో 55 ఏళ్ల వ్యక్తి మృతి: దేశంలో 9కి చేరిన మృతుల సంఖ్య

ఇవాళ ఒక్కరోజే భారత్‌లో ముగ్గురు మరణించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 55 ఏళ్ల వ్యక్తి మరణించగా.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కరోనాతో 433 మంది ఆసుపత్రి పాలయ్యారు. అదే సమయంలో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన 25 ఏళ్ల విశాఖ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 

సోమవారం సాయంత్రం నాటికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 ధాటికి మరణించిన వారి సంఖ్య 15,189కి చేరింది. ఇందులో యూరప్‌కు చెందిన వారే 9,197 మంది ఉన్నారు. తాజాగా స్పెయిన్‌లో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది.

Also Read:లాక్‌డౌన్‌ అమలుకు తెలంగాణ కఠినచర్యలు: మెడికల్ షాపులు తప్ప.. అన్నీ క్లోజ్

గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 1,395 మంది వైరస్ కారణంగా మరణించగా.. ఇందులో 462 మంది స్పెయిన్ దేశస్తులే ఉన్నారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 2,182కి చేరినట్లు స్పెయిన్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.