Omicron: ఆ మూడు గంటలు మద్యం అమ్మకాలు ఆపండి... హైకోర్టు ఆదేశాలు
Omicron Variant: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దీని వ్యాప్తి అధికంగా ఉండటంతో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
Omicron Variant: దక్షిణాఫ్రికాలో నవంబర్ లో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో తీవ్ర స్థాయిలో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. యూరప్ దేశాల్లో అయితే, పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఇక భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. క్రమంగా కొత్త కేసులు పెరుగుతూ.. రోజువారి కేసులు రెట్టింపు దిశగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉండగా, ఒకవైపు కొత్త సంవత్సర వేడుకలకు ప్రజలు సిద్ధమవుతుండటం.. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను సైతం విధించాయి. కొత్త సంవత్సర వేడుకలను సైతం నిషేధిస్తున్నాయి. తాజాగా, మద్రాసు హైకోర్టు కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా నూతన సంవత్సర వేడుకలపై పలు ఆంక్షలను విధించాలని సూచించింది.
Also Read: పోలవరం పనులపై కేంద్ర జల్ శక్తి శాఖ కమిటీ సంతృప్తి.. నేడు కుడికాలువ పనుల పరిశీలన
వైరస్ విస్తరిస్తున్న తీరును పరిగణలోకి తీసుకుని కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబరు 31 రాత్రి 10 గంటల.. అర్ధరాత్రి 1 గంట దాకా.. మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని ఆదేశించింది. ఆ మూడు గంటల పాటు బార్‌లు, హోటళ్లు ఎక్కడా కూడా మద్యం విక్రయించకుండా చర్యలు చేపట్టాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, కరోనా రెండు డోసులు తీసుకున్న ధ్రువీకరణ పత్రం లేకుండా డిసెంబరు 31 న రాత్రి 7గం. తర్వాత బహిరంగ ప్రదేశాలలో ఎవరిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఇదిలావుండగా, ఒమిక్రాన్ వేరియంట్ పుదుచ్చేరిలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఇక్కడ రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ.. ప్రజలు కరోనా నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. అలాగే, కొత్త సంవత్సర వేడుకల సమయంలో ప్రజలు ఆంక్షలను కఠినంగా పాటించాలని కోరారు. ప్రజలంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని ఆమె కోరారు. ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంతో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.
Also Read: Omicron: మహారాష్ట్రలో ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో ఎన్నంటే?
ఇదిలావుండగా, దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో 800లకు పైగా నమోదయ్యాయి. అత్యధికం మహారాష్ట్రలో వెలుగుచూశాయి. ఇతర దేశాల్లో ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మళ్లీ యావత్ ప్రపంచాన్ని హెచ్చరించింది. ఒమిక్రాన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొంది. దీని విజృంభణ కారణంగా హెల్త్ కేర్ సిస్టమ్ ప్రమాదంలో పడే అవకాశముందని వెల్లడించింది. అలాగే, ఇప్పటికే కరోనా మరింత అధిక ప్రభావాన్ని కలిగివుంది.. ఒమిక్రాన్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ముంచెత్తుతున్నది అని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలోని సగానికి పైగా దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది. ఆయా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా కొనసాగుతున్నది. దీంతో కొత్త కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో నిత్యం లక్షకు పైగా కోవిడ్-19 కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు 11 శాతానికి పైగా పెరిగాయి.