పోలవరం పనులపై కేంద్ర జల్ శక్తి శాఖ కమిటీ సంతృప్తి.. నేడు కుడికాలువ పనుల పరిశీలన
Polavaram:పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్ర జలశక్తి కమిటీ సంతృప్తిని వ్యక్తం చేసింది. జల్ శక్తి శాఖ కమిషనర్ ఏఎస్ గోయల్, సీనియర్ జాయింట్ కమిషనర్ అనూప్‌కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలోని ఈ కమిటీ బుధవారం పోలవరం ఎడమ కాలువ, సంబంధిత పనులను పరిశీలించింది. గురువారం కుడికాలువ పనులను పరిశీలించనుంది.
Polavaram: పోలవరం ప్రాజెక్టు గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు, నాణ్యతపై కేంద్ర జల్ శక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎడవ కాల్వకు సంబంధించిన పనులను పరిశీలించిన కమిటీ.. గురువారం నాడు కుడి కాలువలకు సంబంధించి కొనసాడుతున్న పనులను పరిశీలించనుంది. జల్ శక్తి శాఖ కమిషనర్ ఏఎస్ గోయల్, సీనియర్ జాయింట్ కమిషనర్ అనూప్‌కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలోని ఈ కమిటీ మంగళవారం పోలవరం ఎడమ కాలువను పరిశీలించింది. బుధవారం ప్రాజెక్టు స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, అనుసంధానాల పనులు, జలవిద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు, గ్యాప్–1లను, పునరావాస కాలనీలను తనిఖీ చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి కొనసాగుతున్న పనులపై సంతృప్తిని వ్యక్తం చేసింది కమిటీ. పోలవరం ప్రాజెక్టు వివరాలను ప్రాజెక్టు సీఈ బి.సుధాకర్‌బాబు, ఎస్‌ఈ కె.నరసింహమూర్తుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ, సహాయ పునరావాస విభాగం అధికారులతో సమీక్షించారు. నిర్వాసితులకు పునరావాసం పనులను వేగవంతం చేయాలని కమిటీ ఆదేశించింది.
Also Read: Omicron: మహారాష్ట్రలో ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో ఎన్నంటే?
ఈ క్రమంలోనే పోలీవరం ప్రాజెక్టు పనులు మరింత వేగంగా కొనసాగించడానికి అధికారులు కమిటీ ముందు కొన్ని విన్నపాలు చేశారు. 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే మరింత వేగంగా పునరావాసం కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యయాన్ని సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ 2019లోనే ఆమోదించిందని వివరించారు. ఆ తర్వాత రివైజ్ట్ కాస్ట్ కమిటీ రూ.47,727.87 కోట్లకు అంచనా వ్యయాన్ని ఆమోదించిందన్నారు. సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే గడువులోగా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయవచ్చని వెల్లడించారు. దేశంలోని ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నిధులు కేటాయింపు జరపాలని అన్నారు. ముఖ్యంగా అన్ని ప్రాజెక్టుల మాదిరిగా నీటిపారుదల, సరఫరా విభాగం వ్యయాన్ని ఒకటిగానే లెక్కించి, నిధులివ్వాలని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని వివరించారు. దీనిపైజల్ శక్తి శాఖ కమిషనర్ ఏఎస్ గోయల్ సానుకూలంగా స్పందించారు. సీడబ్ల్యూసీ నివేదికను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దృష్టికి మళ్లీ ఇంకోసారి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా, డిజైన్ల ఆమోదంలో జాప్యం వల్లే ప్రాజెక్టు పనులు అలస్యమవుతున్నాయని అధికారులు కమిటీకి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను మే నాటికి, ఎగువ కాఫర్ డ్యామ్‌ను జూన్ మొదటి వారానికే పూర్తి చేసి.. జూన్ 11న అప్రోచ్ చానల్ మీదుగా గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించామని అధికారులు కేంద్ర కమిటీకి వివరించారు. 2018లో ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా వదిలేయడం వల్ల 2019లో వచ్చిన వరదలకు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ నిర్మించే ప్రదేశంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతం, ఇసుక పొరలను పటిష్టం చేసే డిజైన్ల ఆమోదంలో జాప్యం వల్లే ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనుల ప్రారంభంలో ఆలస్యం జరుగుతున్నదని తెలిపారు. ఈనెల 7న డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) చైర్మన్ ఏబీ పాండ్య వస్తున్నారని, అప్పుడు ఈ డిజైన్‌ను కొలిక్కి తెస్తామన్నారు. దాన్ని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వెంటనే ఆమోదించేలా చూడాలని కమిటీని కోరారు. దీనిపై గోయల్ స్పందిస్తూ.. పెండింగ్‌లో ఉన్న డిజైన్లను వేగంగా ఆమోదించాలని సీడబ్ల్యూసీకి ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు.