చెన్నై: ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసిన కేసులో 23 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీరుకు మద్రాసు హైకోర్టు మరణ దండనను ఖరారు చేసింది. కింది కోర్టు అతనికి మరణశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పును హైకోర్టు సమర్థించింది. 

నేరం 2017లో జరిగింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన దశవంత్ కు మహిళ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఫిబ్రవరి 19వ తేదీన తీర్పు వెలువరించింది. ఆ తీర్పును దశవంత్ హైకోర్టులో సవాల్ చేశాడు. 

ఏడేళ్ల బాలికపై దశవంత్ అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన ఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. మహిళా కోర్టుకు తీసుకుని వచ్చినప్పుడు మహిళలు కొంత మంది అతనిపై దాడి చేశారు కూడా.

కుక్కను ఉపయోగించుకుని బాలికను బుజ్జగించి ముగలివక్కంలోని తన ఫ్లాట్ లోకి అతను తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి, గొంతు నులిమి ఆమెను చంపేశాడు. శవాన్ని ట్రావెల్ బ్యాగులో కుక్కి, హైవేపై దాన్ని తగులబెట్టాడు. 

అత్యాచారం, హత్య కేసులో బెయిల్ పై వచ్చిన దశవంత్ నిరుడు డిసెంబర్ లో తల్లిని హత్య చేసి ఆమె ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత అతను ముంబైలో పోలీసులకు పట్టుబడ్డాడు.