దేశంలో పెగాసస్‌ను వినియోగించి తనను, అనేక ఇతర రాజకీయ నాయకులను స్నూప్ చేయడానికి ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కౌంటరిచ్చారు.  

యూకేలో కేంబ్రిడ్జి యూనివర్సిటీ వేదికగా భారత ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ లిస్టులో చేరారు. తన స్టోర్‌లో పెగాసస్ స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసి నిఘా పెట్టారంటూ రాహుల్ అన్న మాటలపై చౌహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ ఫోన్‌లో లేదని, రాహుల్ మెదడులో వుందని ఆయన చురకలంటించారు. అసలు కాంగ్రెస్ డీఎన్ఏలోనే పెగాసస్ ప్రవేశించిందని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ తెలివితేటలకు జాలేస్తోందని శివరాజ్ సింగ్ చౌహన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విదేశాలకు వెళ్లి భారతదేశం పరువు తీయడం కాంగ్రెస్‌కు ఎజెండాగా మారిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. 

ఇకపోతే... కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం రాజ‌కీయ దుమారం రేపుతోంది. త‌న ప్ర‌సంగంలో భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచివుంద‌నీ, తనతో సహా అనేక మంది రాజకీయ నాయకులు ప్ర‌భుత్వ‌ నిఘాలో ఉన్నారని ఆరోపించ‌డంతో పాటు ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. భారత ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉంద‌నీ, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై నిఘా పెట్టార‌ని ఆరోపించారు. అలాగే, పార్లమెంటు, పత్రికా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ ఇలా అన్నింటిపై దాడి జ‌రుగుతున్న‌ద‌ని వ్యాఖ్యానించారు. అయితే, రాహుల్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేత‌లు ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అసోం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ.. రాహుల్ గాంధీ ప్ర‌సంగాన్ని ప్ర‌స్తావిస్తూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విదేశాల్లో భార‌త్ ను కించ‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారంటూ మండిప‌డ్డారు. 

ALso REad: వాస్తవ పరిస్థితులకు దూరంగానే.. రాహుల్ గాంధీ కామెంట్స్‌కు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్..

తాజాగా రాహుల్ వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోదీ పాలనకు గతంలో కాంగ్రెస్ పాలనకు సంబంధించిన తేడాతో రాహుల్ తీరును ఎండగట్టిన వీడియోను రాజీవ్ చంద్రశేఖర్ షేర్ చేశారు. విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాజవంశీకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సెటైర్లు వేశారు. వాస్తవ పరిస్థితులకు, వాస్తవ జీవితానికి దూరంగా వారు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారనే భారతీయులకు మరోసారి నిర్దారణ అయిందని అన్నారు.