కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. రాహుల్ చేసిన కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ.. భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పెగాసస్‌ను వినియోగించి తనను, అనేక ఇతర రాజకీయ నాయకులను స్నూప్ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. తన కాల్‌లు రికార్డ్ అవుతున్నందున ఫోన్‌లో మాట్లాడేటప్పుడు “జాగ్రత్తగా” ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనను హెచ్చరించారని ఆయన ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని చెప్పుకొచ్చారు. విపక్ష నాయకులు అసమంజసమైన క్రిమినల్ కేసులతో నిరంతర ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రాథమిక అంశాలైన పార్లమెంటు, పత్రికా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ పరిమితులను ఎదుర్కొంటున్నాయని రాహుల్ అన్నారు. అలాగే భారత్ జోడో యాత్ర సందర్భంగా కశ్మీర్‌లో చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. 

అయితే రాహుల్ చేసిన కామెంట్స్‌పై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ విదేశాల్లో కూర్చొని భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. విదేశీ గడ్డపై భారత కీర్తిని కించపరిచే ప్రయత్నం జరుగుతుందని రాహుల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

Scroll to load tweet…

తాజాగా రాహుల్ వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోదీ పాలనకు గతంలో కాంగ్రెస్ పాలనకు సంబంధించిన తేడాతో రాహుల్ తీరును ఎండగట్టిన వీడియోను రాజీవ్ చంద్రశేఖర్ షేర్ చేశారు. విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాజవంశీకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సెటైర్లు వేశారు. వాస్తవ పరిస్థితులకు, వాస్తవ జీవితానికి దూరంగా వారు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారనే భారతీయులకు మరోసారి నిర్దారణ అయిందని అన్నారు.