సారాంశం

భారత రక్షణ రంగం బలోపేతం దిశగా మరో ముందడుగు పడింది. తాజాగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 7000 కోట్లు ఖర్చు చేయనుంది. దేశీయంగా తుపాకుల తయారీ స్వావలంబన దిశగా ఇది కీలక ఘట్టంగా చెప్పొచ్చు.. 
 

భారత రక్షణ రంగ బలోపేతం దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.7000 కోట్ల విలువగల అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిల్లరీ గన్ సిస్టమ్ (ATAGS) కొనుగోలు చేసేందుకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదం తెలిపింది. దీంతో దేశీయంగా తుపాకుల తయారీలో స్వావలంబన దిశగా కీలక అడుగు పడింది. ATAGS అనేది భారతదేశంలోనే తొలిసారిగా రూపకల్పన, అభివృద్ధి చేసిన 155 మిల్లీమీటర్ల ఆర్టిల్లరీ గన్. అత్యాధునిక సాంకేతికత, అధిక ఫైరింగ్ శక్తితో ఇది భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని బలపరచనుంది.

భారత ఆర్టిల్లరీ (తుపాకుల) దళంలో గేమ్‌ ఛేంజర్‌: 

ATAGS అంటే అడ్వాన్స్‌డ్ టోడ్ ఆర్టిల్లరీ గన్ సిస్టమ్. ఇది భారత్‌లోనే రూపకల్పన చేసిన, తయారు చేసిన అత్యాధునిక తుపాకీ వ్యవస్థ. ఈ గన్‌కి 52-క్యాలిబర్‌ను కలిగిన పొడవైన బ్యారెల్ ఉంటుంది. దీంతో దాదాపు 40 కిలోమీటర్ల దూరం వరకు బుల్లెట్‌ దూసుకెళ్లగలదు. ఇది సాధారణ తుపాకీలతో పోలిస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎక్కువ పేలుడు పదార్థాన్ని లక్ష్యంపై వేసే సామర్థ్యం ఉంటుంది. లక్ష్యాన్ని సులభంగా గుర్తించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ నిర్ణయం ద్వారా దేశీయంగా తయారవుతున్న రక్షణ టెక్నాలజీలో భారత్ శక్తిని పెంచుకుంటోందని స్పష్టమవుతోంది.

దేశంలోని ప్రైవేట్ కంపెనీలే తయారు చేసేలా: 

మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి ఊతమిచ్చేలా ATAGS ఆర్టిలరీ తుపాకీని భారతదేశమే అభివృద్ధి చేసింది. ఈ తుపాకీని DRDO (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ)తో పాటు భారత్‌లో ఉన్న పలు ప్రైవేట్ పరిశ్రమలు కలిసి తయారు చేశాయి. ఈ తుపాకీకి అవసరమైన భాగాల్లో 65%కి పైగా మన దేశంలోనే తయారు అవుతున్నాయి. ముఖ్యంగా తుపాకీ  బెరల్, మజిల్ బ్రేక్, బ్రీచ్ మెకానిజం, కాల్పులు, రికాయిల్ సిస్టమ్, బుల్లెట్లు పెట్టే వ్యవస్థ ఇవన్నీ మన దేశంలోనే తయారీ అవుతుండడం విశేషం. ఈ అభివృద్ధితో భారతదేశ రక్షణ రంగం బలపడుతోంది. అలాగే విదేశాలపై ఆధారం తగ్గుతోంది. ఇక రక్షణ పరికరాల కోసం ఇతర దేశాల్ని ఎక్కువగా ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు.

వ్యూహాత్మక లాభాలు: 

ATAGS (అడ్వాన్స్‌డ్‌ టోడ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టమ్‌)ని భారత సైన్యంలో చేర్చడం వల్ల ఆర్మీకి ఉన్న పాత 105 mm, 130 mm గన్స్‌కి బదులుగా ఆధునిక తుపాకులు అందుబాటులోకి వస్తాయి. ఈ గన్స్‌ను దేశం పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో మోహరించడం వల్ల భారత సైన్యానికి వ్యూహాత్మకంగా లాభం చేకూరుతుంది. దీనివల్ల భారత సైన్యం మరింత శక్తివంతంగా మారుతుంది. 

దీర్ఘకాలం పనిచేస్తాయి: 

పూర్తిగా దేశీయంగా తయారైన ATAGS గన్‌కి, అవసరమైన విడి భాగాల సరఫరా సులభంగా లభిస్తుంది. దీని రక్షణ, మరమ్మతుల సేవలు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతాయి. దేశంలోనే అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ వల్ల తుపాకులు ఎక్కువ పనిచేయడానికి అవసరమైన మద్దతు లభిస్తుంది. దీని ద్వారా భారతదేశం రక్షణ రంగంలో స్వయంపూర్తిని సాధించడంలో మరింత బలపడుతుంది.

విదేశాలపై ఆధారపడడం తగ్గుతుంది: 

ఈ గన్స్‌ ఉపయోగంతో రక్షణ రంగ అవసరాల కోసం విదేశాలపై ఆధారపపడం తగ్గుతుంది. ముఖ్యమైన భాగాలు అయిన నావిగేషన్ సిస్టమ్, మజిల్ వెలోసిటీ రాడార్, సెన్సార్లు భారతదేశంలోనే తయారు చేశారు. దీంతో భారతదేశం విదేశీ టెక్నాలజీ, దిగుమతులపై ఆధారపపడం భారీగా తగ్గుతుంది. 

ఉద్యోగ అవకాశాలతో పాటు డిఫెన్స్‌ ఎగుమతులు పెరుగుతాయి: 

ATAGS తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. దీని ద్వారా సుమారు 20 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత్‌ గ్లోబల్‌ డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. భవిష్యత్తులో మనదేశం నుంచి స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులకు ఇది నాంది పలకనుంది.