భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆర్మీ అధికారికి సమున్నత పదవితో సత్కరించింది. ఎవరా అధికారి? ఏమిటా పదవి?
Indian Army : భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాకిస్థాన్ తమ ఆర్మీ చీఫ్ ను 'ఫీల్డ్ మార్షల్' గా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. కానీ భారత్ మాత్రం పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో కీలకంగా వ్యవహరించిన ఆర్మీ అధికారికి పదోన్నతి కల్పించింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో వెలుగులోకి వచ్చిన ఇండియన్ ఆర్మీ అధికారుల్లో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఒకరు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ గా పదోన్నతి కల్పించింది.
ప్రస్తుతం భారత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ) గా జనరల్ రాజీవ్ ఘాయ్ ని నియమిస్తూ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈయన భారత సైన్యంలోని ముఖ్యమైన విభాగాలను సమన్వయం చేసుకుంటారు.. ఇది చాలా ముఖ్యమైన పదవిగా రక్షణ శాఖ పేర్కొంటోంది. అంతేకాదు DGMO (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) గా కూడా ఆయన కొనసాగుతారని తెలిపింది.
ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో రాజీవ్ ఘాయ్ పాత్ర...
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ గా చేసుకుని భారత్ వైమానికి దాడులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ద వాతావరణం ఏర్పడింది... మిస్సైల్స్, డ్రోన్స్ తో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. అయితే పాకిస్థాన్ దాడులకు తిప్పికొట్టడమే కాదు ఆ దేశంలోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఇలా ఇండియన్ ఆర్మీ దెబ్బకు తట్టుకోలేకపోయిన పాక్ కాళ్లబేరానికి వచ్చింది... కాల్పుల విరమణకు చర్చలు జరిపింది.
అయితే పాకిస్థాన్ తో కాల్పుల విరమణపై చర్చించిన ఆర్మీ అధికారి ఈ రాజీవ్ ఘాయ్. ఆయన భారత DGMO గా కొనసాగుతున్నారు... పాకిస్థాన్ DGMO ఈయననే కాల్పుల విరమణ గురించి వేడుకున్నారు. పాక్ అభ్యర్థనను మన్నించిన రాజీవ్ ఘాయ్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు... ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి కాల్పుల విరమణ ప్రకటన చేసారు. దీంతో ఇరుదేశాల్లో ఉద్రిక్తతలు తగ్గి శాంతియుత వాతావరణ ఏర్పడింది.
ఎవరీ రాజీవ్ ఘాయ్?
భారత ఆర్మీలోని కుమావున్ రెజిమెంట్ లో సీనియర్ అధికారి ఈ రాజీవ్ ఘాయ్. భారత సైన్యంలో అనేక సాహసోపేత ఆపరేషన్లకు ఆయన నాయకత్వం వహించారు... మరీముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిపిన అనేక ఆపరేషన్లలో ఈయన కీలకంగా వ్యవహరించారు. ఇలా దేశంకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆయనను అనేక పదవులు వరించాయి.
ఇటీవలే అంటే జూన్ 4న జరిగిన డిఫెన్స్ ఇన్వేస్టిచర్ సెర్మనీ 2025 లో రాజీవ్ ఘాయ్ ని యుద్ద సేవా మెడల్ తో సత్కరించారు. తాజాగా ఆయనను డిజిఎంవోగా కొనసాగిస్తూనే డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం.