న్యూఢిల్లీ:  వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ప్రతి ఏటా  మూడు వేల మందిహత్యకు గురౌతున్నారు. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ నివేదికలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహరాల కారణంగా హత్యలు చోటు చేసుకొంటున్నట్టుగా  ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

 2016లో 30,450 మంది హత్యకు గురికాగా వీటిలో పది శాతం కేసులు ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల కారణంగా జరిగాయని జాతీయ నేర గణాంక సంస్థ తేల్చిచెప్పింది. దేశంలో ఏటా మూడువేలమంది ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్ల హత్యకు గురవుతున్నారని పోలీసు రికార్డులే వెల్లడించాయి.
 
వివాహేతర సంబంధాలతో జరిగిన హత్యల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముందుంది. ఆ తర్వాత బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు అధికంగా చోటు చేసుకొన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

దేశంలో వివాహేతర సంబంధాల వల్ల పాట్నా నగరంలో అధికంగా హత్యలు జరిగాయని వెల్లడైంది. ప్రేమవ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్ల యూపీలో 682 మంది హత్యకు గురయ్యారు. బీహార్ లో 382 మంది, తమిళనాడులో 303 మంది మధ్యప్రదేశ్ లో 272 మంది, మహారాష్ట్రలో 265 మంది, గుజరాత్ లో 188 మంది హత్యకు గురయ్యారని ఈ నివేదిక వెల్లడిస్తోంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఏపీలో వివాహేతర సంబంధాల వల్ల  138 మంది హత్యలకు గురయ్యారని  తేలింది. తెలంగాణలో 117 మంది వివాహేతర సంబంధాల వల్ల హతమయ్యారు.  తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌లో స్వాతి అనే వివాహిత ప్రియుడు రాజేష్ తో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.