విదేశాంగ శాఖ ఇటీవలి కాలంలో కొత్తగా జారీ చేసిన పాస్‌పోర్ట్‌లపై కమలం గుర్తు ముద్రించడంతో పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభలోనూ ఈ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పందించారు.

నకిలీ పాస్‌పోర్ట్‌లను గుర్తించేందుకు జాతీయ చిహ్నాన్ని గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. కమలంతో పాటు ఇతర జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్ధతిలో ఉపయోగిస్తామని రవీష్ స్పష్టం చేశారు.

Also Readసంస్కృతం మాట్లాడితే.. డయాబెటిస్ రాదు... బీజేపీ నేత కామెంట్స్

కేరళలోని కోలికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన కొత్త పాస్‌పోర్ట్‌లను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు ఎంకే రాఘవేంద్రన్ లోక్‌సభ జీరో అవర్ సమయంలో లేవనెత్తారు. బీజేపీ తన పార్టీ గుర్తు కమలాన్ని ప్రచారం చేసుకునేందుకే ఇలా చేస్తోందంటూ ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే.

Also read:విషాదం.. ఒక్కరోజే ఎనిమిది మంది ఆత్మహత్య

అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టామని రవీష్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతానికి కమలం గుర్తు వాడామని.. భారతదేశ జాతీయ పుష్పం.. జాతీయ జంతువు ఇలా ఏదైనా సరే రాబోయే రోజుల్లో పాస్‌పోర్టులపై ముద్రిస్తామని రవీష్ కుమార్ స్పష్టం చేశారు.