తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఒక్క రోజే ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. రెండు కుటుంబాలు.. ఒకే రకంగా మోసపోయి చివరకు ఆర్థిక సమస్యలను తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... విల్లుపురం సమీపంలోని సలామత్ నగర్ కి చెందిన అరుణ్ కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా... అరుణ్ కి లాటరీ లు కొనే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఇటీవల అతను ఆన్ లైన్ లో లాటరీలు కొనుగోలు చేశాడు.

కాగా.. తీరా లాటరీ కోనుగోలు చేసిన తర్వాత మోసపోయినట్లు గుర్తించాడు. అసలే ఆర్థిక సమస్యలతో మునిగి తేలుతుంటే... లీటరీ మోసం తెలిసి కుంగిపోయాడు. ఈ క్రమంలో... భార్య , బిడ్డలకు సైనెడ్ ఇచ్చి అనంతరం తాను కూడా తీసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకునేటపుడు సెల్ఫీ వీడియో తీసుకొని దానిని స్నేహితులకు పంపించాడు.

వాళ్లు వచ్చి ఇంటి తలుపులు పగలకొట్టి చూడగా... అప్పటికే ఐదుగురు చనిపోయి కనిపించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని.. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు అరుణ్, శివగామి, ప్రియదర్శిని(5), యువశ్రీ(3), భారతి(నాలుగు నెలలు)గా గుర్తించారు.

ఇదిలా ఉండగా... ఇదే ఆన్ లైన్ లాటరీ కొని మరో కుటుంబం కూడా మోసపోయింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఆ కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుంది. ఒకే కారణంతో ఒకే రోజు 8మంది చనిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.