హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ విమానం హెచ్ఎల్ఎఫ్‌టీ 42 విమానం పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఈ విమానాన్ని ఎరో షోలో ప్రదర్శనకు ఉంచారు. తొలి రోజు ఈ విమానం తోక భాగంలో ఉన్న హనుమంతుడి బొమ్మ రెండో రోజు కనిపించకుండా పోయింది. దీనిపై హెచ్ఏఎల్ సీఎండీ.. పీటీఐకి వివరణ ఇచ్చారు.
న్యూఢిల్లీ: హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సోమవారం బెంగళూరులో ప్రారంభించిన ఎరో ఇండియా 2023లో విమానాలను ప్రదర్శనకు పెట్టింది. ఇందులో హిందుస్తాన్ లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్ (హెచ్ఎల్ఎఫ్‌టీ)- 42 డిస్‌ప్లేలో ఉన్నది. అయితే, సోమవారం ఈ విమానం వెనుక భాగం తోక పై హనుమంతుడి లోగో ఉన్నది. అలాగే, ‘తుఫాన్ రాబోతున్నది’ అనే స్లోగన్ ఉన్నది. కానీ, మంగళవారం ఆ విమానం పై నుంచి హనుమంతుడి లోగో కనిపించకుండా పోయింది. స్లోగన్ ఎప్పట్లాగే ఉన్నప్పటికీ హనుమంతుడి ఫొటో మాత్రం తొలగించారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
దీనిపై హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ పీటీఐ న్యూస్ ఏజెన్సీకి వివరణ ఇచ్చింది. దేశీయంగానే తయారు చేసిన ఎయిర్‌క్రాఫ్ట్ హెచ్ఎఫ్-24 మారుత్ నుంచి ఈ స్లోగన్‌ను తీసుకున్నట్టు తెలిపింది. అయితే, హనుమంతుడి లోగో తీసుకోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవని వివరించింది.
Also Read: Aero India 2023: మొదలైన డ్రోన్స్ షో.. అబ్బురపరుస్తూ అదరగొడుతున్న యుద్ధ విమానాలు.. !
హెచ్ఏఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సీబీ అనంతక్రిష్ణన్ మాట్లాడారు. ఇదంతా ఎలాంటి ఉద్దేశాలు లేకుండానే జరిగిపోయాయని వివరించారు. ఆ ఫొటోను ఎలాంటి ఉద్దేశంతో పెట్టలేదని, అలాగే, దాన్ని తొలగించడం వెనుకా ఎలాంటి ఉద్దేశం లేదని అన్నారు. ఇదంతా ఎలాంటి ఉద్దేశాలు లేకుండా చేసిన పనులు అని వివరించారు.
హెచ్ఏఎల్ తొలిసారి హెచ్ఎల్ఎఫ్‌టీ 42ను ఎరో ఇండియాలో ప్రదర్శనకు ఉంచింది. ఇది నెక్స్ట్ జెన్ సూపర్‌సోనిక్ ట్రైనర్ అని చెబుతుంటారు.
