Bangalore: అగ్నిశ్వర్ జయప్రకాష్ తన కంపెనీ, గరుడ ఏరోస్పేస్, 2024 నాటికి దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ యునికార్న్ స్టార్టప్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే,డబుల్-DGCA సర్టిఫికేషన్‌ను అందుకున్న మొట్టమొదటి సంస్థగా తన కంపెనీ నిలిచిందని ఆయన ఏరో ఇండియా 2023 ఎయిరో షో సందర్భంగా ఏసియానెట్ న్యూస్ తో మాట్లాడుతూ అన్నారు.
Aero India 2023: బెంగూళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2023 షో ఆకట్టుకుంటోంది. పలు దేశాలకు చెందిన అత్యాధుని యుద్ద విమానాలు, వివిధ కంపెనీలు తయారు చేసిన విమానాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. అలాగే, దేశీయంగా మొదలైన పలు డ్రోన్ల తయారీ స్టార్టప్ కంపెనీలు సైతం ఇందులో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. దీనిలో భాగంగా డ్రోన్స్ షో ఘనంగా ప్రారంభమైంది.
ఈ క్రమంలోనే గరుడ ఏరోస్పేస్ కంపెనీ అధినేత అగ్నివీర్ జయప్రకాశ్ తో ఏసియానెట్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిశ్వర్ జయప్రకాష్ తన కంపెనీ, గరుడ ఏరోస్పేస్, 2024 నాటికి దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ యునికార్న్ స్టార్టప్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే,డబుల్-DGCA సర్టిఫికేషన్‌ను అందుకున్న మొట్టమొదటి సంస్థగా తన కంపెనీ నిలిచిందని ఆయన ఏరో ఇండియా 2023 ఎయిరో షో సందర్భంగా ఏసియానెట్ తో మాట్లాడుతూ అన్నారు.
అంతేకాకుండా, డ్రోన్ తయారీదారుగా ఉన్న గరుడ ఏరోస్పేస్ 30 మిలియన్ డాలర్ల లక్ష్యంలో ముందుకు సాగుతూ ఇటీవల 22 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ ఫండ్ ను పొందగలిగింది. ఇది భారతీయ డ్రోన్ రంగంలో అతిపెద్ద ఫండింగ్ గా నిలిచింది. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2023లో తమ సంస్థ ప్రదర్శిస్తున్న ఉత్పత్తుల గురించి, ముఖ్యంగా వజ్ర డిఫెన్స్ డ్రోన్ అభివృద్ధి గురించి అగ్నిశ్వర్ జయప్రకాష్ మాట్లాడారు. వీరి డ్రోన్ అత్యాధునిక బీ2 బాంబర్ పోలికలను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.
అన్ని రకాల డ్రోన్లను తాము తయారు చేస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను తీసుకువస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ డ్రోన్ సహాయంతో రైతులు వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చునని గరుడ అగ్రి డ్రోన్ గురించి వివరించారు. పంట ఆరోగ్యం, పంట శుద్ధి, పంట పరిశీలన, నీటిపారుదల, క్షేత్ర భూసార విశ్లేషణ, పంట నష్టం మదింపులు అన్నీ సేకరించిన సమాచార సేకరణకు ఇవి సహాయపడతాయని తెలిపారు. డ్రోన్ ఆధారిత సర్వేలు పంట దిగుబడులను పెంచడంతో పాటు సమయం, ఖర్చులను తగ్గిస్తాయని అన్నారు. మిడతల దండును నియంత్రించడానికి హ్యాండ్ స్ప్రేయర్లను ఉపయోగించే మానవ చర్యల కంటే గరుడ డ్రోన్ ఆధారిత వ్యవసాయ పిచికారీ కార్యకలాపాలు 80 శాతం ఎక్కువ విజయవంతమయ్యాయని తెలిపారు.
గరుడ మ్యాపింగ్ డ్రోన్ గురించి మాట్లాడుతూ.. వీడియో నిఘా డ్రోన్లు నష్టం స్థాయిని అంచనా వేయడానికి, గ్రౌండ్ సిబ్బందికి రియల్ టైమ్ డేటాను అందించడానికి సహాయం చేయడంలో ఎంతో మెరుగైనవిగా ఉంటాయని అన్నారు. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే, విపత్తు ప్రాంతాలను మ్యాప్ చేయడానికి డ్రోన్లను ఉపయోగించడం వల్ల ఎక్కువ ఖర్చు ఆదా, వేగవంతమైన ప్రతిస్పందనల సమయాలు ఉంటాయని అన్నారు.
డ్రోన్ తయారీదారు గరుడ ఏరోస్పేస్ వృద్ధికి ఆజ్యం పోసేందుకు సిరీస్ ఏ ఫండింగ్ కింద 30 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణలో 22 మిలియన్ డాలర్లను సమీకరించినట్లు పేర్కొన్నారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ స్పిటిక్యాప్ 12 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇతర గ్లోబల్ ఇన్వెస్టర్లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, హెచ్ఎన్ఐలు 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు స్టార్టప్ తెలిపింది. మరో 5 మిలియన్ డాలర్ల నిధులను ఇన్ఫ్రా డెవలప్మెంట్ కంపెనీ, హెచ్ఎన్ఐ, భారత్, యూఏఈ, సింగపూర్ కు చెందిన ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి, అభివృద్ది పనులకు ఈ నిధులను వినియోగించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ తెలిపారు. ఈ నిధుల్లో కొంత భాగాన్ని ఆర్ అండ్ డీ కోసం వినియోగిస్తామనీ, తద్వారా రక్షణ, ఏరోస్పేస్ రంగానికి చెందిన అంతర్జాతీయ కంపెనీల సహకారంతో సాయుధ దళాల కోసం ఏఐ, ఎంఎల్ టెక్నాలజీతో స్మార్ట్ డ్రోన్ల అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు.
