భారత్, మయన్మార్ దేశాల అంతర్జాతీయ సరిహద్దు మీదే ఓ గ్రామం ఉన్నది. అది ఈశాన్య రాష్ట్రం నాగాలండ్‌లోని మోన్ నగరానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రామ ప్రజలు సరిహద్దు మీద ఉండటంతో తరుచూ రెండు దేశాల ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. ప్రతి రోజూ ఏదో కారణం చేత అంతర్జాతీయ సరిహద్దును దాటుతుంటారు.

న్యూఢిల్లీ: విదేశాలు(Foreign Countries) తిరగాలని, వరల్డ్ టూర్ వేయాలని, పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనే ఆశ చాలా మందిలో ఉంటుంది. ఒక వేళ అలా విదేశీ ప్రయాణం చేయాలని భావించినా.. అందుకోసం ఎంచుకున్న ప్రాంతాన్ని బట్టి డబ్బునూ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ట్రావెల్ ఏజెన్సీలు, ప్రయాణాల కోసం బుకింగ్, అక్కడ నివాసానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే విదేశీ పర్యటన చేయడం సామాన్యులకు బహుదూరమైన మాట. ఆ ప్రయాణాలు వ్యయ ప్రయాసాలతో కూడిన పని. కానీ, మన దేశ సరిహద్దు(International Border)లోని ఓ గ్రామ(Longwa Village) ప్రజలు రోజంతా ఒక చోట ఉంటే.. పడుకోవడానికి మరో చోట ఉంటున్నారు. ప్రతి రోజూ అదే తంతు. వారంతా.. ఎలాంటి ముందస్తు ప్లానింగ్స్ లేకుండా.. ప్రత్యేకంగా డబ్బును ఖర్చు పెట్టకుండా రోజూ దేశాన్ని మారి వస్తూ పోతుంటారు. వారంతా సామాన్య జనులే. కానీ, రోజూ దేశ సరిహద్దులు దాటుతుంటారు.

భారత్(India), మయన్మార్(Myanmar) దేశ సరిహద్దుల్లోని లోంగ్వా గ్రామానికి ఈ విశిష్టత ఉన్నది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌(Nagaland)లో మోన్ జిల్లా ఉన్నది. ఈ జిల్లాలోని లోంగ్వా గ్రామం మీదుగా ఈ రెండు దేశాల మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెళ్లుతున్నది. చుట్టూ పచ్చని వాతావరణంలో.. కొండ కోనల మధ్య మరణీయ ప్రకృతి దర్శనం ఇచ్చే ప్రాంతంలో ఈ గ్రామం ఉన్నది. దీనికితోడు అంతర్జాతీయ సరిహద్దు కూడా వెళ్తుండటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ గ్రామానికి సందర్శనకు వస్తుంటారు.

ఈ గ్రామం నుంచి వెళ్లే భారత్, మయన్మార్‌లను విడగొట్టే అంతర్జాతీయ సరిహద్దు ఇళ్ల సముదాయాలను చీలుస్తూ వెళ్తున్నది. కొన్ని ఇళ్లను రెండుగా విభజిస్తున్నది. అంటే.. కిచన్ ఒక దేశంలో ఉంటే.. బెడ్ రూమ్ మో దేశంలో ఉన్నట్టుగా సరిహద్దు విభజిస్తున్నది. ఈ ప్రాంత ప్రజలకు భారత పౌరసత్వం ఉన్నది. అంటే.. విదేశీ పౌరసత్వం కూడా కలిగి ఉండే వెసులుబాటు ఇచ్చే పౌరసత్వాన్ని ఈ ప్రజలు కలిగి ఉన్నారు. ఈ గ్రామంలో ఎక్కువ, ఆదివాసీ, కోయ గిరిజనుల జనాభే ఎక్కువ. వీరంతా తమ జీవన ఉపాధి కోసం.. దినసరి పనుల్లోనూ తరుచూ రెండు దేశాల సరిహద్దు దాటుతుంటారు.

ఈ ప్రత్యేకతల కారణంగా చాలా మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. లోంగ్వా గ్రామానికి చేరాలంటే ముందు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌రకు వెళ్లాలి. నాగాలాండ్‌లోని మోన్ నగరానికి వెళ్లాలి. అక్కడి నుంచి లోంగ్వా గ్రామం సుమారు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రభుత్వ రవాణాలో మోన్ జిల్లా వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలపై లోంగ్వా గ్రామానికి చేరుకోవచ్చు.