Asianet News TeluguAsianet News Telugu

సాకారమైన దశాబ్ధాల కల, మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకంగా ఓటేసిన ఎంఐఎం

ప్రతిష్టాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ చేపట్టారు. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు పడ్డాయి.

Lok Sabha passes women reservation bill ksp
Author
First Published Sep 20, 2023, 7:34 PM IST

ప్రతిష్టాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు పడ్డాయి. ఎంఐఎం ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్ జలీల్‌లు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. చర్చ ముగిసిన వెంటనే బిల్లుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై దాదాపు 8 గంటల పాటు చర్చ జరగ్గా.. 60 మంది సభ్యులు మాట్లాడారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

అయితే బిల్లుపై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. బిల్లు అసంపూర్తిగా వుందని విపక్షాలు మండిపడ్డాయి. ఓబీసీ కోటా వుండాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ చేపట్టారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులుగా అందజేశారు. బిల్లుకు అనుకూలమైతే ఆకుపచ్చ స్లిప్పుపై ‘ఎస్’ అని, వ్యతిరేకమైతే ఎరుపు రంగు స్లిప్పుపూ ‘‘నో’’ అని రాయాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్ వివరించారు. 

అంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్‌లో వుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆయన బుధవారం లోక్‌సభలో ప్రసంగించారు. బిల్లుతో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయని అమిత్ షా చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయాల కోసం వాడుకున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కొన్ని రాజకీయ పార్టీలు పదే పదే రాజకీయం చేశాయని ఆయన దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం రాకతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించిందని అమిత్ షా స్పష్టం చేశారు. మీకు రాజకీయం ముఖ్యం, మాకు మహిళా సాధికారత ముఖ్యమని అమిత్ షా విపక్షాలకు చురకలంటించారు. భేటీ బచావో, భేటీ పడావో అన్నది మా నినాదమని హోంమంత్రి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని ఆయన తెలిపారు. 2024 ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని అమిత్ షా పేర్కొన్నారు. 

అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా వుందన్నారు. మహిళా బిల్లుపై బీజేపీ అందరినీ తప్పుదారి పట్టిస్తోందని.. ఈ బిల్లులో ఓబీసీ రిజర్వేషన్లను ప్రస్తావించలేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కులగణన చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ఓబీసీ వర్గాల పట్ల బీజేపీ వివక్ష చూపుతోందని.. ఇప్పుడున్న వ్యవస్థల్లో ఓబీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు. పార్లమెంట్ కొత్త భవనంలోకి మారుతుంటే రాష్ట్రపతిని ఆహ్వానించలేదని ఆయన దుయ్యబట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios