లోక్ సభ ఎన్నికలు డిసెంబర్‌లోనే ఉండవచ్చని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ ఎన్నికల్లో క్యాంపెయిన్ కోసం బీజేపీ అన్ని హెలికాప్టర్లను బుక్ చేసుకుందని తెలిపారు. తద్వార ప్రతిపక్ష పార్టీలకు హెలికాప్టర్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లోక్ సభ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఉండొచ్చని అన్నారు. బీజేపీ ముందస్తుగానే లోక్ సభ ఎన్నికలకు వెళ్లవచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికీ క్యాన్వాసింగ్ కోసం అన్ని చాపర్లను బుక్ చేసుకుందని అన్నారు. టీఎంసీ యువజన విభాగం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆమె మాట్లాడారు.

బీజేపీ మూడో సారి అధికారంలోకి వచ్చే ప్రయత్నాల గురించి మమతా బెనర్జీ కామెంట్లు చేశారు. ఒక వేళ బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. దేశం నిరంకుశ పాలనను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్ సభ ఎన్నికలను బీజేపీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కాషాయ పార్టీ ఇప్పటికే దేశంలో విభజనలు తెచ్చిందని, వారు మరోసారి దేశంలో అధికారంలోకి వస్తే దేశాన్ని విద్వేష దేశంగా మార్చివేస్తుందని పేర్కొన్నారు.

మూడు దశాబ్దాల సుదీర్ఘ పాలన చేసిన సీపీఎంను పశ్చిమ బెంగాల్‌లో ఓడించామని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తెలిపారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని వివరించారు. 

Also Read: హంతకుడే సంతాపం తెలిపినట్టు బీజేపీ తీరు: ఎమ్మెల్సీ కవిత

జాదవ్ పూర్ యూనివర్సిటీ ఘటనపై స్పందిస్తూ.. గోలీ మారో అని నినాదాలు చేసిన బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. వర్సిటీలో ఈ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు.

రాష్ట్రంలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారు అక్రమంగా ఫైర్ క్రాకర్ నిర్వహిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇటీవలే రాష్ట్రంలో ఓ ఫైర్ క్రాకర్ యూనిట్‌లో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ అక్రమ ఫైర్ క్రాకర్ల తయారీకి కొందరు పోలీసు సిబ్బంది సహకారం కూడా ఉన్నట్టు తనకు తెలిసిందని వివరించారు.