బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు సంధించారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలకు పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరని అన్నారు. బీజేపీ రైతు గోస సభ పెట్టడం హంతకుడే హతుడికి సంతాపం తెలిపినట్టు ఉన్నదని కామెంట్ చేశారు. 

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈ పార్టీలది కేవలం అధికార యావ మాత్రమేనని, ప్రజల సంక్షేమం వీటికి ముఖ్యం కాదని ఆరోపణలు చేశారు. దశాబ్దాల పాటు దళితులను పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించడం విడ్డూరంగా ఉన్నది. బీజేపీ రైతు సభ పెట్టడం హంతకుడే హతుడికి సంతాపం తెలిపినట్టుగా ఉన్నదని ఫైర్ అయ్యారు. అన్ని వర్గాలను ఆదుకునే ఎకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో సమావేశమై మాట్లాడారు.

దేశాన్ని, అలాగే, ఉమ్మడి రాష్ట్రాన్ని దీర్ఘకాలం పాలించినది కాంగ్రెస్ పార్టీనే అని, ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు దళితులకు ఏమో చేస్తామని ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించడం భావ దారిద్ర్యం తప్ప మరేమీ కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖర్గే వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం చూస్తుంటే అర్రస్ పాడినట్టు ఉందని పేర్కొన్నారు. 

బీజేపీ రైతుల గోస అంటూ సభ పెట్టడం, దానికి అమిత్ షా హాజరై మాట్లాడటం చూస్తే హంతకుడే సంతాపం తెలిపినట్టు ఉన్నదని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న పనులనే బీజేపీ కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. కేసీఆర్ ప్రారంభించిన రైతు బంధు కార్యక్రమాన్నే కాపీ కొట్టి మోడీ ప్రభుత్వం రైతులకు డబ్బులు వేస్తున్నదని తెలిపారు. తొలుత 13 కోట్ల మందికి ఈ రైతు బంధు ప్రారంభించారని, ఇప్పుడేమో దాన్ని 2.5 కోట్ల మందికే కుదించిందని ఆరోపించారు. 

Also Read:  Chandrayaan-3: ఇస్రో 3 సక్సెస్ లో భాగస్వామ్యమైన యువ ముస్లిం శాస్త్రవేత్తలు.. ఇంతకీ వారెవరూ..?

తెలంగాణలో పట్టు సాధించడానికే బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రయాస పడుతున్నాయని అన్నారు. అంతకు మించి ప్రజా సంక్షేమం వాటికి పట్టదని తెలిపారు. ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో అభ్యర్థులు లేరని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీఎం క్యాండిడేట్‌ నిర్వివాదంగా కేసీఆర్‌నే అని పునరుద్ఘాటించారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తారని, గెలుస్తారని పేర్కొన్నారు.