కరోనా వైరస్ నేపథ్యంలో భారతదేశంలో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కడివి అక్కడ స్తంభించిపోయాయి. ఎక్కడి ప్రజలు అక్కడే స్థంబించిపోయారు. పేదలకు, దారిద్ర్య రేఖ దిగువనున్నవారికి, రెక్కాడితే డొక్కాడనివారికి ఈ లాక్ డౌన్ శరాఘాతముగా పరిణమించింది. 

లాక్ డౌన్ వల్ల ప్రజలు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధలు దేశమంతా ఉన్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ పరిధిలో కూడా ఇలా ఆకలికి అలమటించడం కనిపించింది. 

వారణాసి నియోజకవర్గ పరిధిలోని ముషహర్ సామాజికవర్గానికి చెందిన పిల్లలు తినడానికి తిండిలేక ఆకలికి తట్టుకోలేక గడ్డి తింటున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్థానిక రిపోర్టర్ తీసిన ఈ చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో అందరి గుండెలను పిండేస్తున్నాయి. 

తినడానికి తిండిలేక నీళ్లు, ఉప్పు కలుపుకొని పిల్లలు ఈ గడ్డి తిని తమ కడుపు నింపుకుంటున్నారు. ఆ పిల్లలకు కడుపునింపడానికి ఆ తల్లులవద్ద ఏమీ లేక పిల్లలు ఇలా గడ్డి తింటుంటే... ఆ తల్లులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు.

దళిత సామాజికవర్గంలో అత్యంత వెనకబడ్డ వారుగా పరిగణించబడే ఈ ముషహర్ లు కడు పేదరికంలో జీవనం సాగిస్తున్నారు. గతంలో వారు ఎలుకలను చంపి తినేవారు. అందుకే వారికి ఆ పేరు వచ్చింది. 

లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడా బయట పని దొరక్క, తినడానికి తిండిలేక ఆ కుటుంబాలు అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తున్నాయి. 

Also Read: కరోనా లాక్ డౌన్: కన్న కొడుకు శవాన్ని కని, పెంచిన చేతులపైన్నే మోసుకెళ్లి..

ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే అధికార యంత్రాంగం అక్కడ వాలిపోయింది. స్థానిక సీఐ నుంచి మొదలు జిల్లా కలెక్టర్ వరకు అందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. స్థానిక సీఐ వారికి సహాయం అందించారు. స్థానిక కాంగ్రెస్ నేత వారికి అవసరమైన నిత్యావసరాలతోపాటుగా కొన్ని సబ్బులను కూడా అందించారు. 

స్థానిక పోలీసులు ఆ ప్రజలతోమాట్లాడుతూ... అవసరమైతే... గ్రామా సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారమవకపోతే... తనదగ్గరికి రావాలని అన్నాడు.