అగ్నిపథ్ పథకాన్ని సవాల్ చేస్తూ ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కేవియట్ దాఖలు చేసింది. ఈ పథకంపై నిర్ణయం తీసుకునే ముందు తమ మాట కూడా వినాలని కోరింది.
అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన తప్పకుండా వినాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. త్రివిధ దళాల్లో స్వల్ప కాలిక రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అ్నగిపథ్ పథకంపై ఇప్పటి వరకు మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఈ పిటిషన్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. తమ వ్యాజ్యం వినకుండా ఎలాంటి ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయకూడదని అందులో కోరింది. కాగా అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ప్లాన్‌ను పునఃపరిశీలించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది హర్ష్ అజయ్ సింగ్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకం ప్రకటన దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలకు కారణమైందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Agnipath: అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మూడో పిటిషన్ దాఖలు
అలాగే గతంలో కూడా ఈ పథకంపై న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా, పార్లమెంటు ఆమోదం లేకుండా శతాబ్దాల నాటి సాయుధ దళాల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసిందని న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పథకం వల్ల జాతీయ భద్రత, సైన్యంపై పడే ప్రభావాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయవాది విశాల్ తివారీ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. దీంతో పాటు ప్రజా ఆస్తుల విధ్వంసానికి దారితీసిన హింసాత్మక ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టును కోరారు.
రాష్ట్రపతి ఎన్నికలు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ
జూన్ 14న కేంద్రం ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఒక్క సారిగా అనేక రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి. ఈ అగ్నిపథ్ పథకం ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ దళాల్లో సర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మహిళలు, పురుషులను ఇద్దరినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అలవెన్సులతో కలుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఇందులో నాలుగేళ్ల పాటు పని చేసిన అగ్నివీర్ లకు పెన్షన్ సౌకర్యం ఉండదు.
అగ్నిపథ్ పథకంపై చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. మొదటి రిక్రూట్ మెంట్ కు అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచింది. అలాగే నాలుగేళ్ల సేవలు పూర్తి చేసుకున్న అగ్నివీర్లకు.. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, అన్ని 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో చేర్చుకోవడానికి పది శాతం రిజర్వేషన్ ఇస్తామని తెలిపింది.
