మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం సంక్షోభంలో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. శివసేన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత గుజరాత్‌లో మకాం వేసినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో బలాబలాలపై చర్చ జరుగుతున్నది. ఒక వేళ ఆ 22 మంది ఎమ్మెల్యేలు శివసేనకు రాజీనామా చేస్తే ప్రభుత్వం మైనార్టీలో పడుతుందా?
ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయే ముప్పు కనిపిస్తున్నది. ఉన్నట్టుండి శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే తనతోపాటు 21 మంది ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని బీజేపీ కోట.. గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌లో మకాం వేసినట్టు కథనాలు వస్తున్నాయి. వారంతా బీజేపీ అధీనంలోకి వెళ్లినట్టుగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇదే తరుణంలో బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశానికి ఢిల్లీ వెళ్లినట్టుగా తెలిసింది. కాగా, పరిస్థితులు తమ అధీనంలోనే ఉన్నాయని, ఆ ఎమ్మెల్యేలను సంప్రదించామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
అయితే, గుజరాత్ వెళ్లినట్టుగా భావిస్తున్న 22 మంది శివసేన ఎమ్మెల్యేలు ఒక వేళ బీజేపీ తీర్థం పుచ్చుకుంటే.. అంటే.. వారంతా శివసేన పార్టీకి రాజీనామా చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి. ఒక వేళ వారంతా నిజంగానే రాజీనామా చేస్తే శివసేన ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుందా? అసెంబ్లీలో శివసేనకు ఎంత బలం ఉన్నది. మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీల బలాలపై ఓ చూపు వేద్దాం.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. ఇందులో ఒక ఎమ్మెల్యే మరణించారు. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో 288 మంది చట్ట సభ్యులు ఉన్నారు. ఒక వేళ విశ్వాస పరీక్ష జరిగితే.. ఈ స్థితిలో మెజార్టీ మార్క్ 144.
ప్రస్తుతం అధికారంలోని మహావికాస్ అఘాదీ కూటమి అంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు 152 మంది ఉన్నారు. అంతేకాదు, వీరితోపాటు కొందరు స్వతంత్రుల మద్దతు కూడా తమకు ఉన్నదని ఈ కూటమి చెబుతున్నది.
ఇందులో శివసేన ఎమ్మెల్యేలు 56 మంది. అయితే, ఇందులో నుంచి ఏక్‌నాథ్ షిండేతోపాటు మరో 21 మంది శివసేన ఎమ్మెల్యేలు గుజరాత్‌లోని సూరత్ హోటల్‌లో బీజేపీ అధీనంలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక వేళ వీరంతా శివసేన పార్టీకి రాజీనామా చేస్తే ఈ పార్టీ బలం అసెంబ్లీలో 34కు పడిపోతుంది.
ఒక వేళ వారు శివసేన పార్టీకి రాజీనామా చేస్తే అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 133కు పడిపోతుంది.
కాగా, బీజేపీ ప్రస్తుతం తమ వద్ద 135 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నదని చెబుతున్నది. అంటే.. మెజార్టీ మార్క్ కంటే కూడా రెండు సంఖ్యలు ఎక్కువగానే పేర్కొంటున్నది. బీజేపీ ఎమ్మెల్యేలు 106 మంది ఉన్నారు.
ప్రస్తుతం సూరత్ హోటల్‌లో ఉన్నట్టుగా చెబుతున్న 22 మంది శివసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక వేళ బీజేపీలోకి చేరాలంటే.. ఫిరాయింపు వ్యతిరేక చట్టం ప్రకారం వారు తమ పార్టీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అనంతరం నిర్వహించే (ఈసీ నిబంధనల ప్రకారం సాధ్యమైతే) ఉపఎన్నికలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది.
