హిమాచల్ ప్రదేశ్‌లో శిమ్లాలోని కృష్ణానగర్ ఏరియాలో కొండ చరియలు భయానకంగా విరిగిపడ్డాయి. ఇందులో కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పోటెత్తుతున్నాయి. వీటికితోడు చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇవి ప్రజల జీవితాల్లో పెను విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా, హిమాచల్ ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడటంతో పేకమేడల్లా కూలిపోయిన ఇళ్లకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
శిమ్లాలోని కృష్ణానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగా కళ్ల ముందరే క్షణాల వ్యవధిలోనే ఇల్లు ధ్వంసమైపోయాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వర్ష సంబంధం తీవ్ర ఘటనలతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 55కు చేరినట్టు సమాచారం.
Also Read: భారత ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ హబీబ్ కన్నుమూత
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో 857 రోడ్లు బ్లాక్ అయిపోయాయి. 4,285 ట్రాన్స్‌ఫార్మర్లలో ఇబ్బందులు తలెత్తాయి. 889 చోట్ల నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
