లక్షద్వీప్ బీజేపీ నేత ఒకరు తన భార్యతో కలిసి జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదిప్పుడు వివాదాస్పదంగా మారింది.
లక్షద్వీప్ : జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలపై లక్షద్వీప్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కాసిం హెచ్‌కేపై కవరత్తి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. బీజేపీ నేత తన భార్యతో కలిసి జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు చూసిన కొందరు ఇది అవమానకరం అని ఆరోపించారు. దీంతో పోలీసులు అతని మీద కేసు నమోదుచేసి, విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు పంపారు.
"CrPC సెక్షన్ 41-A సెక్షన్ సబ్‌సెక్షన్ (1) కింద అందిన సమాచారం.. ప్రకారం అధికారంలో ఉన్న మీరు జాతీయ జెండాను అవమానపరిచిన ఆరోపణలు నమోదయ్యాయి. దీనిమీద కవరత్తి పోలీస్ స్టేషన్ U/s 2 నిరోధక చట్టంలోని నేరం ప్రకారం కేసు నమోదయ్యింది. దీని ప్రకారం మీరు నిందితులుగా పరిగణించబడతారుఅని మీకు తెలియజేస్తున్నాం. ఆగస్ట్ 14న నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఆగస్ట్ 25న ఉదయం 10:30 గంటలకు లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని మిమ్మల్ని ఇందుమూలంగా సూచిస్తున్నాము. దయచేసి ఈ ఆర్డర్‌ను పాటించకపోవడం, తిరస్కరించడం శిక్షార్హమని గుర్తుంచుకోండి. U/s 174 IPC," అన నోటీసులు చదువుకోవాల్సిందిగా కోరుతూ పంపించారు.
Bilkis Bano Case: ఇదేనా నవ భారతం ? అత్యాచార దోషుల విడుదలపై విపక్షాల ఆగ్రహం
కాగా, జాతీయ జెండా, త్రివర్ణ పతాకం ఎగురవేయాలనుకున్నా.. దాన్ని పట్టుకోవాలన్నా.. దానికి కొన్ని నియమనిబంధనలను ఉన్నాయి. జాతీయ జెండాను ఉపయోగించే సమయంలో ఫ్లాగ్ కోడ్ 2002 నిబంధలను తప్పనిసరిగా పాటించాలి. జెండాను ఉపయోగించే విధానంలో తెలిసో, తెలియకో ఫ్లాగ్ కోడ్ ను ఉల్లంఘించినట్లైతే.. చట్టంలో ఉన్న ప్రకారం శిక్షలు, జరిమానాలు విధిస్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా జాతీయ జెండాను అవమానపరిచినా, అగౌరపరిచినా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆ నియమాలు ఇవే...
జాతీయ జెండాను అత్యంత గౌరవంగా చూసుకోవాలి. జెండాను ఎగురవేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అది చిరిగిపోయి, నలిగిపోయి, పాతగా అయిపోయి ఉండకూడదు.
మూడు వర్ణాలు, అశోక చక్రం తప్ప మరే వర్ణాలు, రాతలు ఉండకూడదు.
కాషాయ రంగు పైకి, ఆకుపచ్చ రంగు కిందికి ఉండాలి. నిలువుగా ప్రదర్శించేసమయంలో కాషాయం రంగు ఎడమవైపుకు ఉండాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగబడిన జెండాను ఎగరవేయకూడదు.
జెండా వందన సమయంలో త్రివర్ణ పతాకానికి సరిసమానంగానూ, దానికన్నా ఎత్తులోనూ మరే ఇతర జెండాలు ఉండకూడదు.
జాతీయ జెండాను నేలమీద అగౌరవంగా పడేయకూడదు. వివిధ అలంకరణ సామాగ్రిగా జాతీయ జెండాను ఉపయోగించకూడదు.
పబ్లిక్ మీటింగుల్లో, సమావేశాల్లో స్టేజ్ మీద కుడివైపున మాత్రమే అంటే ప్రేక్షకులకు ఎడమ వైపుగా అన్నట్లు.. జెండాను నిలపాలి.
జెండా మీద ఎలాంటి అలంకరణలు, పూలు పెట్టకూడదు. పతాకం మధ్యలో పూలను వాడచ్చు.
వస్తువులు, భవనాల మీద జెండాను కప్పకూడదు. దుస్తులుగా కుట్టించుకోకూడదు.
