Asianet News TeluguAsianet News Telugu

Bilkis Bano Case: ఇదేనా న‌వ భార‌తం ? అత్యాచార దోషుల‌ విడుద‌లపై విప‌క్షాల ఆగ్ర‌హం

Bilkis Bano Case: బిల్కిస్‌ బానోకేసు లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ, బీజేపీ ఆధ్వర్యంలో ‘నయా భారతం’ నిజమైన రూపం ఇదేనంటూ విమర్శలు గుప్పించాయి.

Opposition Slams BJP, PM Modi Over Bilkis Bano Case Convicts Release
Author
Hyderabad, First Published Aug 17, 2022, 6:17 AM IST

Bilkis Bano Case: 2002 గోధ్రా అల్లర్ల నేప‌థ్యంలో జ‌రిగిన‌ బిల్కిస్ బానో అత్యాచార‌, హ‌త్య‌కేసులో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11మందిని గుజరాత్ ప్ర‌భుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్ర‌ధాని మోడీ "నారీ శక్తి"ని ప్రశంసించిన కొన్ని గంటల్లోనే ఈ దోషులను విడుదల చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తు్న్నాయి.

2002 గోద్రా ఘటన తర్వాత బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. సోమవారం జైలు నుంచి బయటకు వచ్చిన దోషులకు పలువురు ఘనస్వాగతాలు పలుకడంతో పాటు స్వీట్లు పంచుకున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడుతున్నాయి. ఇదేనా న్యూ ఇండియా,  ఇదేనా నిజమైన రూపం అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. 

మహిళల భద్రత, గౌరవం, సాధికారత గురించి మాట్లాడిన ప్రధాని మోదీ తన మాటలను స్వయంగా విశ్వసిస్తారో లేదో దేశానికి చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. 'నిన్న ఎర్రకోట ప్రాకారాల మీద నుంచి ప్రధానమంత్రి మహిళల భద్రత, మహిళా శక్తి, మహిళల గౌరవం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కొన్ని గంటల తర్వాత గుజరాత్ ప్రభుత్వం అత్యాచార దోషుల‌ను విడిచిపెట్టింది. విడుదలైన వారికి సన్మానం జరుగుతోంది. ఇదేనా అమృత్ మహోత్సవ్‌ అని ఖేరా అన్నారు.

CPI(M) కూడా దోషుల విడుదలను ఖండించింది, నవ భారతదేశ అసలు ముఖం ఇది. దోషులుగా నిర్ధారించబడిన హంతకులను, రేపిస్టులను విడుదల చేసారు, న్యాయం కోసం పోరాడిన ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు జైలు శిక్ష విధించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే మాట్లాడుతూ.. బిల్కిస్ బానో 2002 గుజరాత్ హింసాత్మక ఘటనలో అత్యాచారానికి గురయ్యారని, కానీ, ఇప్పుడూ ఆమె కుటుంబాన్ని మొత్తం హత్య చేసి సామూహిక సమాధిలో పాతిపెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం  దారుణమైన నేరానికి పాల్పడిన మొత్తం 11 మంది రాక్షసులను విడుదల చేసింది. ప్రజలు & నోయిడా మీడియా ఆగ్రహం ఎక్కడ ఉంది? అని ఆయన ట్వీట్ చేశారు.

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా వారి విడుదలపై ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. మహిళల గౌరవాన్ని తగ్గించే పని చేయవద్దని ప్రతిజ్ఞ చేయాలని మోడీ భారతీయులను కోరారని ఒవైసీ అన్నారు. ప్ర‌ధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో "నారీ శక్తి'కి మద్దతు ప్ర‌క‌టించారు. కానీ, గుజరాత్ బిజెపి ప్రభుత్వం సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేరస్థులను అదే రోజు విడుదల చేసింది. సందేశం స్పష్టంగా ఉందని ఒవైసీ ఎద్దేవా చేశారు.

బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీ కూడా ప్రధాని వ్యాఖ్యలను ప్రస్తావించారు.11 మంది దోషుల విడుదలకు, న్యాయ స్ఫూర్తికి మధ్య ఉన్న భారీ అంతరం ఉంద‌ని బహిర్గతం చేసిందని అన్నారు. అయితే, గుజరాత్ ప్రభుత్వం ఈ చర్యను సమర్థించింది, 2008లో దోషులుగా నిర్ధారించబడిన సమయంలో రాష్ట్రంలో అమలులో ఉన్న ఉపశమన విధానం ప్రకారం దోషులు విడుదలయ్యారని, ఈ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను ఉల్లంఘించారనే వాదనలను తిరస్కరించారు.

గోద్రా ఘటన తర్వాత గుజరాత్ అల్లర్లు చెలారేగిన విష‌యం తెలిసిందే. 3 మార్చి 2002 తేదీన ఓ అల్లరి మూక బిల్కిస్ ఇంట్లోకి చొరబడి.. ఆమె కళ్ల ముందే మొత్తం కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా హ‌త‌మారించింది. ఆ సమయంలో బిల్కిస్ బానో ఐదు నెలల గర్భిణి. అయినా.. ఎలాంటి జాలి, ద‌య లేకుండా ఆమెపై పలువురు ఒక్కొక్కరుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె నొప్పితో స్పృహతప్పి పడిపోయింది.

అనంత‌రం.. గ్రామ‌స్తుల స‌హకారంతో ఆమె ప్రాణాభ‌యంతో అక్క‌డి నుంచి పారిపోయింది. అనంత‌రం న్యాయం కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేశాడు. దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది, కానీ ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం వారిని జైలు నుండి విడుదల చేసింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు గుజరాత్ అల్లర్లలో అత్యంత దారుణమైన కేసు

Follow Us:
Download App:
  • android
  • ios