ఆ చిన్నారుల వయసు 8 నుంచి 13 యేళ్లు మాత్రమే. కానీ వారు సంపాదన సంవత్సరానికి అక్షరాలా రూ. 18 లక్షలు. నెలకు లక్షన్నర జీతంతో వారు ఇంత చిన్న వయసులోనే ఉద్యోగం చేస్తున్నారు. ఇంతకీ వారు చేసే పనేంటంటే..
మధ్యప్రదేశ్ : కొన్ని విషయాలు వింటే అసలు నమ్మశక్యం కాదు. కానీ అవి వాస్తవాలు. అందుకే అలాంటి విషయాలు విన్నప్పుడు ఆశ్చర్యంతో నోరేళ్లబెడుతుంటారు. ముక్కున వేలేసుకుని ఔరా అనుకుంటాం. అలాంటి ఘటనే ఇది. ఆ కుర్రాళ్ళ వయసు 8 నుంచి 13 సంవత్సరాలు. కానీ వారు అందుకునే జీతం మాత్రం నెలకు దాదాపు లక్షన్నర. వారి జీవనశైలి ఎంతో లగ్జరీగా ఉంటుంది. వారికి అన్ని సౌఖ్యాలు అందుబాటులో ఉంటాయి. ఇంతకీ వారు చేస్తున్న పని తెలిస్తే మాత్రం.. ముందు చెప్పినట్టుగా షాక్ అవ్వడం ఖాయం. ఇంతకీ వారేం చేస్తారంటే.. అతిథుల బంగారాన్ని చాకచక్యంగా కొట్టేస్తుంటారు.
రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో తమ చేతివాటాన్నిచూపిస్తూ తమ యజమానులకు బంగారు పంట పండిస్తుంటారు. ఇక్కడ జరిగే పెద్ద పెద్ద పెళ్లిళ్లకు వెళుతూ.. అక్కడికి హాజరయ్యే అతిథుల బంగారాన్ని అత్యంత నేర్పుతో కొట్టేస్తుంటారు. ఈ పని కోసమే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ ముఠా వీరిని నియమించుకుంటుంది. వారికి ఆ పనిలో తగిన శిక్షణ కూడా ఇచ్చింది. పెద్దింటి పెళ్లిళ్లలోఎలా నడుచుకోవాలో.. అనుమానం రాకుండా ఎలా ఉండాలో ఈ శిక్షణలో వారికి నేర్పిస్తారు.
పెళ్లికి వెళ్లేప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా నడవాలి, అక్కడ తెలియని వారైనా సరే ఎలా మాట్లాడాలి? ఎలా కూర్చోవాలి? ఎలా వారితో కలిసిపోవాలి? అని అన్ని రకాల అంశాలలోనూ వారికి శిక్షణ ఇస్తారు. ఇదంతా ఎలా బయటపడిందంటే.. ఈ ముఠాకు చెందిన ఓ కుర్రాడు తాజాగా పోలీసులకు దొరికాడు. దీంతో ముఠాకు సంబంధించిన విషయాలన్నీ పోలీసులకు తెలిపాడు. అవి విని వారు కూడా షాక్ అయ్యారు.
ఈనెల తొమ్మిదవ తేదీన మధ్యప్రదేశ్లోని బుండీలో ఓ పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో ఓ మైనర్ బాలుడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. బాలుడు చెప్పిన వివరాలు విని పోలీసులు అవాక్కయ్యారు. ఆ మైనర్ బాలుడు మూడో తరగతి వరకే చదువుకున్నాడు. తను ఓ ముఠాకు పని చేస్తున్నానని చెప్పాడు. ఇది తన ఉద్యోగం అని…సంవత్సరానికి రూ.18 లక్షల జీతం అని చెప్పాడు. తానొక్కడే కాదు తనలాంటి వాళ్ళు చాలామంది ఆ ముఠాలో పని చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాడు.
ఎక్కడ ఏ పెళ్లి జరుగుతుంది? ఏ పెళ్లికి వెళ్లాలి? అనే వివరాలను ముఠా హెడ్ తమకు చెబుతాడని.. ఆ పెళ్ళికి తాము ఖాళీ సంచితో వెళ్లి.. బ్యాగ్ నిండా బంగారు నగలతో తిరిగి రావాలని చెప్పాడు. ఇదే తమ పని, ఉద్యోగం అని తెలిపాడు. దీనికోసం ఇలాంటి వివాహ వేదికల దగ్గరికి లగ్జరీ కార్లలో, విమానాల్లో, రైళ్లల్లో కూడా తమని పంపిస్తారని చెప్పాడు. ఈ ముఠా ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో చేస్తోంది. హర్యానా, ఢిల్లీలో కూడా ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతుంది.
దీనికోసం పిల్లలను ఎంపిక చేసుకుని వారి తల్లిదండ్రులతో ముఠా సభ్యులు డీల్ చేసుకుంటారు. వారికి నమ్మకం కుదరడం కోసం ఓ ఏడాది జీతాన్ని ముందుగానే ఇచ్చేస్తారు. ఆ తర్వాత పిల్లల్ని ఉద్యోగంలోకి తీసుకున్నట్టు లెక్క. ఇక ఆ తర్వాత ఎలా నగలు కొట్టేయాలి, పెళ్లిలో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో శిక్షణ ఇస్తారు. ఏ పెళ్ళికి ఎవరు వెళ్లాలి? అనేది కూడా షెడ్యూల్ చేస్తారు.
పిల్లల్ని ఎందుకు ఎంపిక చేసుకుంటారంటే.. చిన్నపిల్లల విషయంలో ఎవరికీ అనుమానం రాదు. పెళ్లి వేడుకలో వధూవరుల దగ్గరికి వెళ్లినా కూడా పెద్దగా ఎవరు అనుమానించరు. ఈ కారణంతోనే ముఠా ఇంత భారీ స్కెచ్ వేసింది. ఇలా ఇప్పటివరకు ఈ ముఠా కొన్ని కోట్ల రూపాయల విలువైన నగలను పెళ్లిళ్లలో చోరీ చేసినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలుడు చెప్పిన వివరాల మేరకు ఈ ముఠాకు సంబంధించిన సభ్యుల కోసం గాలింపు ప్రారంభించారు.
