రాజస్థాన్ లో ప్రైవేటు వైద్యుల నిరసనలు మిన్నంటున్నాయి. రాష్ట్రప్రభుత్వం చేసిన రైట్ టు హెల్త్ బిల్లుకు వ్యతిరేకంగా పానీపూరీ బండీలు, పరాఠా బండీలు పెట్టుకుంటున్నారు వైద్యులు.
రాజస్థాన్ : రాజస్థాన్లో ఓ మహిళ వైద్యురాలు పానీపూరి అమ్ముతూ.. పానీపూరి వ్యాపారిగా మారిపోయారు. రోడ్డుమీద పానీ పూరి బండి పెట్టుకుని నడుపుతున్నారు. రాజస్థాన్ లోని సీకర్ లో ఈ దృశ్యం కనిపించింది. అస్వస్థతతో తన దగ్గరికి వచ్చిన రోగులను పరీక్షించి.. స్వస్థత చేకూర్చాల్సిన ఆమె ఇలా పానీపూరి బండి నడుపుతూ కనిపించారు. తాళం వేసిన ఆసుపత్రి ఎదుటే ఆమె ఇలా చేస్తున్నారు. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. రాజస్థాన్లో .. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులు.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆరోగ్య బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.
ఈ ఆందోళనలు, నిరసనల్లో భాగంగానే.. అనిత అనే ఈ డాక్టర్ ఇలా పానీపూరి బండి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రి మీద ఉన్న బోర్డును కూడా తీసేసి.. దానిమీద ‘అనిత.. పుచ్కావాలీ’ అని పేరు రాయించి మరీ పానీపూరీ దుకాణం పెట్టారు. నేమ్ బోర్డు లో కూడా తన పేరును మాజీ ప్రైవేట్ డాక్టర్ అని మార్చుకున్నారు. ఇలాంటి నిరసనల్లో భాగంగానే మరో వైద్యుడు ఆయన ఆసుపత్రిని పరాటా సెంటర్గా మార్చారని కూడా ఆమె తెలిపారు. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ‘రైట్ టు హెల్త్’ బిల్లు విషయంలో వైద్యులు ఈ మేరకు నిరసనలు చేపట్టారు.
బెలూన్లతో భారత్ కు డ్రగ్స్ తరలిస్తున్న పాక్ స్మగ్లర్లు.. అప్రమత్తమైన అధికారులు
ప్రైవేటు ఆసుపత్రుల ఆందోళనల మధ్యే రాజస్థాన్ ప్రభుత్వం ‘రైట్ టు హెల్త్ బిల్లు’కు ఆమోదం తెలిపింది. ఇంతకీ ఈ బిల్లులో ఏముందంటే.. రాష్ట్రానికి చెందిన ఏ పౌరుడైనా.. రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలోనైనా.. ఎలాంటి చార్జీలు లేకుండా.. అత్యవసర చికిత్సను పొందవచ్చు. దీంతో ప్రైవేటు వైద్యులు మండిపడ్డారు. ఈ చట్టం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల వ్యవహారాల్లో రాజస్థాన్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తున్నారు.
