వారికి తలవంచా.. సీఎం పదవిని వదులుకున్నా, అసలు కారణమిదే : డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసు నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో తెలిపారు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. సోనియా, రాహుల్ , ఖర్గేల ముందు తాను తలవంచానని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య పోరు నడిచింది. ఇందుకోసం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా మంతనాలు జరిపింది. ఇద్దరూ సీఎం పదవి తప్ప మరేం అక్కర్లేదని చెప్పడంతో పార్టీ పెద్దలకు ఏం చేయాలో పాలపోలేదు. చివరికి సోనియా గాంధీ జోక్యం చేసుకోవడంతో డీకే శివకుమార్ వెనక్కి తగ్గారు. ఆమె మాట మేరకు డిప్యూటీ సీఎం పదవితో ఆయన సరిపెట్టుకున్నారు.
తాజాగా రామనగరలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేపట్టారు. సోనియా, రాహుల్ సూచన మేరకు సీఎం కావాలనే తన కోరికను విడిచిపెట్టానని ఆయన తెలిపారు. తనను ముఖ్యమంత్రిని చేసేందుకు మీరంతా ఓట్లు వేశారని, కానీ అధిష్టానం మాత్రం మరోలా నిర్ణయం తీసుకుందని డీకే శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్ , ఖర్గేల ముందు తాను తలవంచానని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు.. సీఎం సిద్ధరామయ్య తన మంత్రులకు కొత్త టార్గెట్ నిర్దేశించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాల్లో కనీసం 20 స్థానాలను గెలవాలని సూచించారు. ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయని పేర్కొన్న సిద్ధరామయ్య .. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు 20 సీట్లు గెలిచి కానుకగా ఇవ్వాలన్నారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో వుంచుకుని నిబద్ధత, నిజాయితీ, చురుకుదనంతో తమ బాధ్యతలు నిర్వర్తించాలని మంత్రులకు సూచించారు. ఇచ్చిన హామీలు ప్రజలకు చేరేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కావొద్దన్నారు.
ప్రజా సమస్యలు వినండి, స్పందించండి అంటూ సూచించారు. రాష్ట్ర ప్రజలు మనకు అపూర్వమైన మెజారిటీతో పాటు గొప్ప బాధ్యతను కూడా ఇచ్చారని.. దానికి అనుగుణంగా ప్రజానుకూలమైన పాలనను అందించడం మన విధి అని సిద్ధరామయ్య అన్నారు. స్థానికంగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చిన్న చిన్న పనులకు కూడా విధానసౌధకు రాకుండా చూడాలని సీఎం సూచించారు. ప్రజలకు ఆమోదయోగ్యం పనిచేసి లోక్‌సభ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని నమోదు చేయాలన్నారు. కర్ణాటక ద్వారా కేంద్రంలోని దుష్ట పరిపాలనకు ముగింపు పలికే పరిస్ధితి వుందన్నారు. ఈ విషయం మరిచిపోకుండా మంత్రులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు.