Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ కేసీఆర్.. డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ.. తెలంగాణ‌లో కాంగ్రెస్- వైఎస్ఆర్టీపీల పొత్తు..?

Bengaluru: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని షర్మిల ఆసక్తిగా ఉన్నారనీ, ఈ విషయమై ఆమె డీకే శివకుమార్‌తో మాట్లాడారని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి.
 

YS Sharmila meets Karnataka Deputy CM DK Shivakumar in Bengaluru amid talks of YSRTP-Congress alliance
Author
First Published May 29, 2023, 2:24 PM IST

YSRTP-Congress alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని రాజ‌కీయ పార్టీలు ప్ర‌త్యేక వ్యూహాలు, ప్రాణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నాయి. అలాగే, పొత్తుల విష‌యం గురించి కూడా చ‌ర్చ‌ల‌ను ప్రారంభించాయి. ఈ క్ర‌మంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని షర్మిల ఆసక్తిగా ఉన్నారనీ, ఈ విషయమై ఆమె శివకుమార్‌తో మాట్లాడారని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి.

 

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీలో రాజ‌కీయప‌రంగా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. 

అయితే, ఇది కేవలం ఇరువురు నేతల మధ్య సుహృద్భావ సమావేశం మాత్రమేననీ, ఎలాంటి వివరాలను వెల్లడించలేదని డీకే శివకుమార్ కార్యాలయం తెలిపింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుంచి షర్మిలకు డీకే శివకుమార్ అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని షర్మిల భావిస్తున్నారని, ఈ మేరకు ఆమె డీకే శివకుమార్ తో మాట్లాడినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వ్యతిరేక ఓట్లను ఏకం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ భేటీ ఇప్పుడు అలాంటి చ‌ర్య‌ల‌కు ఊత‌మిస్తాయ‌న‌డంతో సందేహం లేదు. రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ వీరి భేటీపై చ‌ర్చ సాగుతోంది. కానీ అధికారికంగా తెలంగాణ కాంగ్రెస్ మాత్రం దీనిపై స్పందించ‌లేదు. 

కర్ణాటక ఉపముఖ్యమంత్రిగా శివకుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారని షర్మిల కొనియాడారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందనే పుకార్లపై వైయస్సార్ టిపి అధ్యక్షురాలు17 మే 2023 న స్పందిస్తూ.. "రాష్ట్రంలో కే. చంద్రశేఖర రావు తిరిగి అధికారంలోకి రావడం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము ఎవరితోనైనా చర్చలకు.. పొత్తులకు సిద్ధంగా ఉన్నాము" అని అన్నారు. అలాగే, ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రతి పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందనీ, ఇందులో ఆశ్చర్యపోనవసరం లేదని షర్మిల అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios