Kishtwar Cloudburst Tragedy: జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో ఆకస్మిక వరదలతో 60 మంది మృతి, 69 మంది గల్లంతు. వంద మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నా ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. 

Kishtwar Cloudburst Tragedy: జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లా కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. ఆ ప్రాంతాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆకస్మిక వరదలు రౌద్రరూపం దాల్చడంతో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అధికారులు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లాలో జరిగిన కుంభవృష్టి భారీ ప్రాణనష్టం మిగిల్చింది. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 60కు చేరగా, గాయపడినవారి సంఖ్య వందకు పైగా ఉందని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా వెల్లడించారు. ఇంకా 69 మంది గల్లంతు కాగా, వారిని వెతికే పనిలో పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, దాదాపు 300 మంది సైనికులు నిమగ్నమయ్యారు.

సహాయక చర్యలు

ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సహాయక చర్యలు నిలిచిపోయాయి. శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు వాట్సాప్‌ ద్వారా ఫొటోలు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మందిని మాత్రమే గుర్తించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రధాని మోడీ స్పందన

ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాలతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కిశ్త్‌వాడ్‌ వరదల్లో 500 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చు. కొందరు అధికారులు ఆ సంఖ్య వెయ్యి దాటొచ్చని చెబుతున్నారు. ఇది తీవ్ర విషాదకరమైన క్షణమని మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు.

వరదల్లో చిక్కుకున్న భక్తులు

మచైల్‌ మాత ఆలయానికి వెళ్ళిన వందలాది మంది భక్తులు చశోతీ సమీపంలోని హమోరీ, మచైల్‌ గ్రామాల్లో చిక్కుకుపోయారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతోపాటు మొబైల్‌ నెట్‌వర్క్‌ కూడా పనిచేయక, వారిని సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.