Asianet News TeluguAsianet News Telugu

‘చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు థ్యాంక్స్..’- న్యాయశాఖ మంత్రి గా తొలగింపు తర్వాత కిరణ్ రిజిజు తొలి ట్వీట్

కేంద్ర న్యాయశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించిన తరువాత కిరణ్ రిజిజు తొలిసారిగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, అలాగే న్యాయశాఖ సిబ్బందికి ధన్యవాదాలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. 

Kiran Rijiju responded for the first time after being sacked as the Minister of Law. He tweeted thanking Prime Minister Modi and Chief Justice Chandrachud..ISR
Author
First Published May 18, 2023, 1:18 PM IST

కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించి ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించిన కొంత సమయం తరువాత కిరణ్ రిజిజు స్పందించారు. తన కొత్త బాధ్యతల్లోనూ అదే ఉత్సాహంతో ప్రధాని నరేంద్ర మోడీ విజన్ ను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని ట్వీట్ చేశారు. న్యాయాన్ని సులభతరం చేయడంలో సహకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు, న్యాయాధికారులకు ఆయన  కృతజ్ఞతలు తెలిపారు.

న్యాయశాఖ కొత్త మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు..

ఈ మేరకు కిరణ్ రిజుజు ఓ ట్వీట్ చేస్తూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. మన పౌరులకు న్యాయ సేవలను సులభతరం చేస్తూ.. అందించడానికి భారీ మద్దతు ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, దిగువ న్యాయ అధికారులు, మొత్తం న్యాయవ్యవస్థకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. 

‘మోడీ దూరదృష్టి ఉన్న నాయకుడు’ అనే మాటకు కట్టుబడే ఉన్నాను- సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎంఆర్ షా

‘‘వినయపూర్వక బీజేపీ కార్యకర్తగా నేను స్వీకరించిన భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖలో ప్రధాని నరేంద్ర మోడీ విజన్ ను నెరవేర్చడానికి నేను ఎదురు చూస్తున్నాను’’ అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా.. ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆయన తన ట్విట్టర్ బయోను కూడా మార్చారు. 

జ్యుడీషియల్ నియామకాలపై సుప్రీంకోర్టులో పలుమార్లు వాదోపవాదాలు చేసిన రిజిజు 2021 జూలై 7న న్యాయశాఖ మంత్రిగా పదోన్నతి పొందారు. అంతకు ముందు ఆయన క్రీడలు, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో నియామకాలు చేపట్టే కొలీజియం విధానంపై రిజిజు న్యాయవ్యవస్థతో విభేదిస్తూ వస్తున్నారు. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి విరుద్ధమని గత ఏడాది నవంబర్ లో ఆయన వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ నామినీలను చేర్చాలని కోరుతూ జనవరిలో ఆయన సీజేఐ చంద్రచూడ్ కు లేఖ రాశారు.

ఉత్తర ఇటలీలో వరదల బీభత్సం.. 9 మంది మృతి, నిరాశ్రయులైన వేలాది మంది.. ఫార్ములా వన్ రేసు రద్దు..

కాగా.. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయశాఖ కొత్త మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న ఆయనకు ఈ అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆయన కూడా తన ట్విట్టర్ బయోను మార్చుకున్నారు. రాజస్థాన్ లోని బికనీర్ నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికైన మేఘ్వాల్ కు.. 2013లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.

Follow Us:
Download App:
  • android
  • ios