Asianet News TeluguAsianet News Telugu

Omicron: పిల్లలు, టీకా వేసుకోనివారికి ఎక్కువ ముప్పు.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికాలో కేసులు భారీగా పెరిగాయని, అందులో చిన్న పిల్లల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నదని వివరించారు. ఇదే సందర్భంలో ఒమిక్రాన్‌తో చిన్న పిల్లలకు, టీకా ఒక్క డోసు కూడా వేసుకోనివారికి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని తెలిపారు.

kids and unvaccinated at risk with omicron says WHO chief scientist soumya swaminathan
Author
New Delhi, First Published Dec 6, 2021, 9:18 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పటికే సుమారు 40 దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. మన దేశంలో ఒమిక్రాన్ కేసులు 23కు చేరడంతో ఆందోళనలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరికలు చేసింది. డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్ మూడు రెట్లు అధికంగా రీఇన్ఫెక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్(Soumya Swaminathan) వెల్లడించారు. అంతేకాదు, ఈ ఒమిక్రాన్ వేరియంట్‌తో చిన్న పిల్లలు, ఒక్క డోసు కూడా వేసుకోని వారికి ముప్పు ఎక్కువ అని వివరించారు. ఒక సారి కరోనా బారిన పడి రికవరీ అయ్యాక 90 రోజుల తర్వాత మళ్లీ వైరస్ బారిన పడటాన్ని రీఇన్ఫెక్షన్ అంటారు.

డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ మూడు రెట్లు అధికంగా రీఇన్ఫెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని తెలిపారు. అయితే, ఈ వేరియంట్ గురించి సమగ్ర అభిప్రాయానికి ఇప్పుడే రాలేమని అన్నారు. కానీ, పెరుగుతున్న కేసులకు, హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతున్న వారి సంఖ్యకు మధ్య తేడా ఎక్కువగా ఉన్నదని వివరించారు. అంటే, ఒమిక్రాన్ బారిన పడ్డవారిలో చాలా మంది హాస్పిటల్స్‌లో చేరాల్సిన ముప్పులోకి వెళ్లడం లేదని తెలిపారు. అయితే, ఈ వేరియంట్ తీవ్రతను అధ్యయనం చేయడానికి మరో రెండు లేదా మూడు వారాలు వేచి ఉండాల్సిందేనని అన్నారు.

Also Read: Omicron: మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్.. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 23

ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో కేసుల గురించి సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ ప్రస్తావించారు. ఆ దేశంలో ఒమిక్రాన్ కారణంగా కేసులు భారీగా పెరుగుతున్నాయని అన్నారు. అయితే, అందులోనూ ఈ వేరియంట్ బారిన పిల్లలు ఎక్కువగా పడుతున్నట్టు రిపోర్టులు వచ్చాయని వివరించారు. ఆ దేశం టెస్టుల సంఖ్యనూ గణనీయంగా పెంచిందని చెప్పారు. ఈ సందర్భంలోనే ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా చిన్న పిల్లలకు, ఒక్క డోసు కూడా వేసుకోని వారికి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని తెలిపారు. అదే సమయంలో చిన్న పిల్లలకు ఇంకా వ్యాక్సిన్‌లు పెద్ద మొత్తంలో అందుబాటులో లేవనీ అన్నారు.

పిల్లలకు టీకా ఎక్కువగా అందుబాటులో లేవని, చాలా తక్కువ దేశాలు మాత్రమే పిల్లలకు టీకాలు వేస్తున్నాయని వివరించారు. ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరిగినప్పుడు పిల్లలు, టీకా ఒక్క డోసు కూడా వేసుకోని వారికి ముప్పు ఎక్కువగా ఉండవచ్చని అన్నారు. అయితే, పిల్లలపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉన్నదని, అందుకు డేటా ఇంకా కావాల్సి ఉన్నదని చెప్పారు.

Also Read: Omicron: డెల్టా కంటే ప్రమాదకరం కాకపోవచ్చు.. అమెరికా ఆంక్షలు ఎత్తేస్తుంది.. టాప్ సైంటిస్టు ఫౌచీ

టీకా పంపిణీపైనా సైన్స్ ఆధారిత విధానాలను అవలంభించాల్సి ఉంటుందని ఆమె సూచించారు. ఇది వరకు మనం ఎదుర్కొన్న వైరస్‌నే ఎదుర్కొంటున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, కాబట్టి, కట్టడి చర్యలు అవే ఉంటాయని తెలిపారు. అయితే, ఈ ఒమిక్రాన్ వేరియంట్ కోసం ప్రత్యేక టీకా కావాలని భావిస్తే.. దానికంటే ముందు మరో నిర్ధారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు. ముందు ఈ వేరియంట్ వైరస్ సామర్థ్యాన్ని ఎంత వరకు తప్పించుకోగలుగుతున్నది అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని చెప్పారు. ఆ తర్వాతే ప్రత్యేక టీకాను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios