Asianet News TeluguAsianet News Telugu

Omicron: డెల్టా కంటే ప్రమాదకరం కాకపోవచ్చు.. అమెరికా ఆంక్షలు ఎత్తేస్తుంది.. టాప్ సైంటిస్టు ఫౌచీ

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై అమెరికా టాప్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌచీ స్పందించారు. డెల్టా  వేరియంట్ కంటే ఇది ప్రమాదకరం కాకపోవచ్చని, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ కారణంగా సీరియస్ కేసులు రిపోర్ట్ కావడం లేదని వివరించారు. అయితే, ఇవి ప్రాథమిక అంచనాలేనని, సమగ్ర అంచనా కోసం మరింత కాలం వేచి చూడాల్సిందేనని అన్నారు. ఒమిక్రాన్ తీవ్రత స్వల్పంగానే ఉండే అవకాశం ఉందన్నట్టు సంకేతాలు ఇచ్చిన ఆయన అమెరికా ప్రభుత్వం త్వరలోనే ప్రయాణ ఆంక్షలను ఎత్తేసే ఆలోచన చేస్తున్నట్టూ తెలిపారు.
 

omicron variant not much danger than delta says US scientist anthony fauci
Author
New Delhi, First Published Dec 6, 2021, 2:45 PM IST

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ వేరియంట్ సుమారు 40 దేశాలకు పాకింది. మన దేశంలోనూ 20కి మించి కేసులు నమోదు కావడం ఆందోళనలను మరింత పెంచాయి. అయితే, అమెరికా టాప్ సైంటిస్టు ఆంథోనీ ఫౌచీ అంచనాలు మాత్రం కొంత ఊరట ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం, డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరం కాకపోవచ్చునని వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులను పరిశీలిస్తే అది అత్యధిక తీవ్ర వ్యాధిని కలుగజేస్తుందని అనిపించడం లేదని తెలిపారు. అయితే, ఇవి కేవలం ప్రాథమిక అంచనాలేనని అన్నారు. సమగ్రమైన ఒక అంచనాకు రావడానికి మరింత కాలం వేచి చూడాల్సిందేనని చెప్పారు.

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడటానికి ముందు కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని అమెరికా ప్రభుత్వానికి టాప్ ప్యాండమిక్ అడ్వైజర్ అయిన ఆంథోనీ ఫౌచీ అన్నారు. ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరగడంతో ఆ దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయని విశ్లేషించారు. అయితే, ఇప్పుడు ఈ వేరియంట్‌పై కచ్చితమైన నిర్ణయానికి రాలేమని తెలిపారు. అయితే, ఈ వేరియంట్ తీవ్ర రోగాన్ని కలిగిస్తున్నట్ట పరిస్థితులు కనిపించడం లేదని వివరించారు. కాబట్టి, ఈ సంకేతాలు ఒక రకంగా ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు.

Also Read: Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తుఫాను.. రాజస్థాన్‌లో కొత్తగా 9 మందికి గుర్తింపు, దేశంలో 21కి చేరిన సంఖ్య

దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు బయటపడగానే యూకే వెంటనే ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. దాని వెంటే ఇటలీ, జర్మనీ సహా ఇతర ఐరోపా దేశాలు, అమెరికా సహా చాలా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాకు రాకపోకలను చాలా వరకు నిలిపేశాయి. అమెరికా కూడా ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అయితే, ఆ ప్రయాణ ఆంక్షలను సడలించే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్టు ఆంథోనీ ఫౌచీ వెల్లడించారు. అయితే, ఎప్పుడు సడలిస్తారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే సరైన సమయంలో అమెరికా ప్రభుత్వం ప్రయాణాలపై విధించిన ఆంక్షలను ఎత్తేస్తుందని వివరించారు.

అయితే, దక్షిణాఫ్రికాలో త్వరలోనే కేసులు భారీగా పెరగవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ వేరియంట్ ఇప్పుడు పిల్లల్లకూ వేగంగా సోకుతున్నదని, తద్వారా సీరియస్ కేసులు కూడా ఎక్కువగా అయ్యే ముప్పు ఉన్నదని అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఇప్పటివరకు వ్యాక్సిన్ ఒక్కడోసూ తీసుకోనివారికే ప్రమాదం.. సీసీఎంబీ డైరెక్టర్...

రాజస్ధాన్‌లో నిన్న కొత్తగా 9 మందిలో ఈ వేరియంట్ నిర్థారణ అయ్యింది. దీంతో ఇండియాలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని (jaipur) ఆదర్ష్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 9మందికి ఈ రకం వేరియంట్‌ వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చినట్లు తెలిపింది. 

అంతకుందు మహారాష్ట్రలో (maharashtra) ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ అయ్యింది. నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ రకం వేరియంట్ వెలుగుచూసింది. అలాగే ఫిన్లాండ్‌ నుంచి పుణె (pune) వచ్చిన మరో వ్యక్తిలోనూ ఒమిక్రాన్ వైరస్‌ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో 9, మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 2, ఢిల్లీ, గుజరాత్‌లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజులోనే 17 కేసులు నమోదు కావడం దేశంలో కలకలం రేపుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios