137 సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు 10 గంటలకు ప్రారంభమవుతాయి. రాహుల్ గాంధీ కర్ణాటకలో ఓటు వేయనున్నారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవి కోసం సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ తలపడుతున్నారు. 137 ఏళ్ల పురాతన పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచి నాయకత్వం వహించడం గడిచిన 24 ఏళ్లలో ఇదే తొలిసారి కానుంది.
ఈ ఎన్నికల్లో 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేసి పార్టీ చీఫ్ ను రహస్య బ్యాలెట్ లో ఎన్నుకుంటారు. న్యూఢిల్లీలోని అక్బర్ రోడ్డులోని 24వ నంబరు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అలాగే దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. పార్టీ చరిత్రలో దాదాపు 137 ఏళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నికల ద్వారా నిర్ణయించడం ఇది ఆరోసారి.
రూ. 30 కోట్ల విలువైన రెండున్నర కేజీల పాము విషం స్మగ్లింగ్..ఎక్కడంటే..
సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 19న ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. దీంతో ఆయన యాత్ర కొనసాగుతున్న కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఉన్న సంగనకల్లులోనే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేయనున్నారు. 20 ఏళ్లకు పైగా ఈ పదవిలో సోనియా గాంధీ పనిచేశారు.
కాగా.. తిరువనంతపురంలోని కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శశిథరూర్ ఓటు వేయనున్నారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తాము మద్దతిస్తున్న అభ్యర్థికి ‘టిక్’ గుర్తుతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు.
పార్టీ సభ్యులు మార్పును తీసుకొచ్చేందుకు తమ ధైర్యాన్ని ప్రదర్శించాలని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు శశి థరూర్ కోరారు. ఇదిలా ఉండగా మల్లికార్జున్ ఖర్గే గాంధీ కుటుంబంతో సన్నిహితంగా ఉండటం, సీనియర్ నాయకుల మద్దతు ఉండటం వల్ల ఆయన అనుకూల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఇద్దరు అభ్యర్థుల విషయంలో గాంధీ కుటుంబం తటస్థంగా ఉందని, అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ లేరని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి.. ఇంకో పావుగంటలో ఇల్లు చేరతామనగా.. కబలించిన మృత్యువు..
ప్రచారం చివరి రోజున ఖర్గే, థరూర్ వరుసగా బెంగళూరు, లక్నోలను సందర్శించినప్పుడు ప్రతినిధులకు గట్టిగా తమ విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో ఖర్గే మాట్లాడుతూ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే గాంధీల సలహాలు, మద్దతు కోరేందుకు వెనుకాడబోనని, ఎందుకంటే పార్టీ ఎదుగుదల వెనుక ఆ కుటుంబం ఉందని తెలిపారు. ఆయన ఈ ఎన్నికల్లో తనను తాను ‘‘ప్రతినిధుల అభ్యర్థి’’గా అభివర్ణించుకున్నారు.
ఖర్గేకు మద్దతిస్తున్న కొందరు సీనియర్ నాయకులపై థరూర్ పరోక్షంగా విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారో తమకు తెలుసునని పార్టీ కార్యకర్తలకు చెప్పారు. కాగా.. కొత్త పార్టీ అధ్యక్షుడికి ఓటు వేసినప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు తమ హృదయాలు చెప్పే మాట వినాలని థరూర్ అన్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి ఖర్గేకు అనుకూల అవకాశాలు ఉన్నాయి.
