పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ముందే తెలుసా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. నిఘా సంస్థలు ప్రధానికి హెచ్చరిాంచినా మోదీ సర్కార్ పర్యాటకులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.
కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసారు. పహల్గాం ఉగ్రదాడికి భద్రతా లోపాలే కారణమంటూ మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కశ్మీర్ ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశాలున్నాయని ప్రధానికి తెలిసినా పర్యాటకులకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని ఖర్గే ఆరోపించారు.
“మోదీ ప్రభుత్వం భద్రత కల్పించకపోవడంతో పహల్గాంలో 26 మంది మరణించారు. కేంద్రం తగిన భద్రతను పర్యాటకులకు అందించలేదు. మోదీ ఈ పహల్గాం దాడి సమయంలోనే కశ్మీర్ లో పర్యటించాల్సి ఉంది… కానీ ఈ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ఎందుకంటే కాశ్మీర్‌లో గందరగోళం ఏర్పడుతుందని ఆయన నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయి” అని ఖర్గే పేర్కొన్నారు.
ప్రభుత్వ నిఘా సంస్థలు ప్రధాని నరేంద్ర మోదీకి భద్రతా ముప్పు గురించి తెలియజేసినా పర్యాటకులను హెచ్చరించడంగానీ, మరేదైనా భద్రతా చర్యలుగానీ తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రధాని భద్రతకే పౌరుల ప్రాణాల కంటే ప్రాధాన్యత ఇచ్చారని ఖర్గే అన్నారు.
‘’మీకు కశ్మీర్ లో దాడుల గురించి ముందే తెలుసు. అందుకే కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారు… మరీ ఈ విషయం పోలీసుల ద్వారా పర్యాటకులకు ఎందుకు చెప్పలేదు? అక్కడికి వెళ్లవద్దని పర్యాటకులకు ఎందుకు ముందే హెచ్చరించలేదు? మీరు వారికి చెప్పి ఉంటే 26 మంది ప్రాణాలు దక్కేవి” అని ప్రధాని మోదీని ఖర్గే నిలదీసారు.
ఇక కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో పాటు కుటుంబసభ్యులకు కేంద్ర సంస్థలు పంపిన నోటీసులపైనా ఖర్గే రియాక్ట్ అయ్యారు. ఇలాంటి చర్యలతో కాంగ్రెస్ ఎప్పటికీ బలహీనపడదని ఆయన ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. “ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. అలాంటి పార్టీకి ఈడీ, సీబీఐ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టి బలహీనపరచాలని మీరు అనుకున్నారు. అది ఎప్పటికీ జరగదు” అని ఆయన అన్నారు.