ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మంగళవారం ఒక్క రోజే తొమ్మిది కేసులు నమోదయ్యాయి. కేరళలో 9, కర్ణాటకలో 3 కొత్త కేసులు నమోదయ్యాయి.

కేరళలో ఆరు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ బారిన వారి సంఖ్య 12కు చేరింది. ఇది రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, అంగన్‌వాడీలు, మదర్సాలను మార్చి 31 వరకు మూసివేయాలని ఆయన ఆదేశించారు.

Also Read:కరోనా వైరస్ రాకుండా...'కోవా పంజాబ్' మొబైల్ యాప్...

అలాగే ఏడో తరగతి పరీక్షల్ని కూడా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అటు కర్ణాటకలోనూ మూడు కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బి. శ్రీరాములు ప్రకటించారు.

దీంతో కర్ణాటకలో కరోనా బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది. వైరస్ సోకిన వారితో పాటు వారి కుటుంబసభ్యుల్ని ప్రత్యేక వార్డులో ఉంచామని శ్రీరాములు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు.

సోమవారం సాయంత్రం అమెరికా నుంచి బెంగళూరు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కరోనా సోకడంతో కలకలం రేగింది. అయితే అతను దాదాపు 2,500 మందికి పైగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తిరిగినట్లు అంచనా వేస్తున్నారు.

Also Read:సీఎం రిక్వస్ట్.. అప్పటి వరకు థియేటర్లు బంద్.. స్టార్ హీరో సినిమాకు దెబ్బ

అతనితో పాటు బస్సు, విమానం, కారులో ప్రయాణించిన వారందరీని పరిశీలనలో ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వారి నమూనాల్ని సేకరించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. కేరళ, కర్ణాటకలో కొత్త కేసుల కారణంగా భారత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 56కి చేరింది.