ఆన్‌లైన్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు.. డెలివరీ బాక్సులో సబ్బు, 5 రూపాయిల నాణెం.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే
ఈ కామర్స్ సైట్స్ చేసే కొన్ని పొరపాట్లు కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా కేరళకు చెందిన ఎన్నారైకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. iPhone 12 ఆర్డర్ చేసిన అతడికి.. సబ్బుతో పాటుగా 5 రూపాయిల కాయిన్ డెలివరీ అయింది.
ఈ కామర్స్ సైట్స్ చేసే కొన్ని పొరపాట్లు కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులు ఆర్డర్ చేసిన వారికి.. సబ్బులు, రాళ్లు వంటివి అందుతున్నాయి. తాజాగా ఇలాంటి షాకింగ్ అనుభవమే ఓ కేరళ ఎన్నారైకి చోటుచేసుకుంది. రూ. 70 వేలు పెట్టి iPhone 12 ఆర్డర్ చేసిన అతడికి.. సబ్బుతో పాటుగా 5 రూపాయిల కాయిన్ డెలివరీ అయింది. తాను ఆర్డర్ చేసిన బదులుగా.. పార్సిల్‌లో వచ్చిన వస్తువులు చూసి ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించి ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని ప్రచురించింది.
కొచ్చిలోని అలువాకు చెంది నూరుల్ అమీన్.. ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో అక్టోబర్ 12న రూ. 70,900 చెల్లించి ఐఫోన్ ఆర్డర్ చేశాడు. అయితే ఆర్డర్ డెలివరీ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించిన అమీన్.. డెలివరీ బాయ్ ముందే తనకు వచ్చిన బాక్స్‌ను తెరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రికార్డు చేశాడు. అయితే బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో డిష్ వాష్ బార్, రూ. 5 కాయిన్ ఉన్నాయి. ఇందుకు సంబంధించి అమీన్.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అమీన్ బుక్ చేసిన ఫోన్.. సెప్టెంబర్ నుంచి జార్ఖండ్ రాష్ట్రంలో వేరే వ్యక్తి వినియోగిస్తున్నట్టుగా తేంది. ‘మేము ఇందుకు సంబంధించి అమెజాన్ సిబ్బందిని, తెలంగాణ కేంద్రంగా ఉన్న విక్రేతను సంప్రదించాం. అక్టోబర్‌లో ఆర్డర్ చేసిన ఫోన్.. సెప్టెంబర్ 25 నుంచి జార్ఖండ్‌లో వినియోగంలో ఉంది. మేము విక్రేతను సంప్రందించినప్పుడు ఫోన్ స్టాక్ అయిపోయిందని.. అమీన్ చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుందని చెప్పారు’అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
ఇటీవల మహారాష్ట్రలో టీవీ నటుడు పరాస్ కల్నావత్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. పరాస్ కల్నావత్.. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ అనే కంపెనీ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేశాడు. అవి డెలివరీ అయ్యాక బ్యాక్స్ ఓపెన్ చేసి షాక్ తిన్నాడు. ఎందుకంటే.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ సిస్టమ్‌లో ఎర్రర్ వల్ల.. కేవలం అతడికి ఖాళీ బాక్స్ డెలివరీ అయింది.