కేరళలోని మలప్పురం జిల్లాలో తానూర్ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా మరణించారు. ఈ ప్రమాదం తర్వాత బోటు యజమాని నాజర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

కేరళలోని మలప్పురం జిల్లాలో తానూర్ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా మరణించారు. ఈ ప్రమాదం తర్వాత బోటు యజమాని నాజర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పోలీసులు నాజర్ వాహనాన్ని సోమవారం ఎర్నాకులంలో సీజ్ చేశారు. ఎర్నాకుళంలోని పలారివట్టంలో పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా.. నాజర్ బంధువులతో ఉన్న వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఎర్నాకులంలోని ఏదైనా స్టేషన్‌లో నాజర్ లొంగిపోవచ్చని భావిస్తున్నారు. ఇక, వాహనంలో ఉన్న నలుగురు బంధువులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. బోటు ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు నాజర్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉంటే.. బోటు ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రిటైర్డ్ జస్టిస్ నారాయణ కురుప్ మండిపడ్డారు. 2002లో కుమరకోం బోటు ప్రమాదంపై దర్యాప్తు జరిపిన న్యాయ కమిషన్‌కు నారాయణ కురుప్ అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో జల రవాణా కోసం సేఫ్టీ కమిషనర్‌ను నియమించాలన్న నివేదికలోని కీలకమైన సిఫార్సును ప్రభుత్వం విస్మరించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విషాదాల నుంచి ఏమీ నేర్చుకోకపోవడం బాధాకరమన్నారు. 

Also Read: కేరళ బోటు ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన..

వాహనాలను మోడిఫైడ్‌ చేసినప్పుడు మోటారు వెహికల్స్ డిపార్ట్‌మెంట్ జరిమానా విధిస్తుందని.. కానీ ఇలాంటి పడవలను నీటిలోకి అనుమతించే ముందు వాటిపై అధికారులు ఎటువంటి చర్య తీసుకోరని విమర్శించారు. 

Also Read: Kerala Boat Tragedy: సహాయక చర్యలకు సాయం అందిస్తున్న ఇండియన్ నేవీ..

ఇక, ఈ ప్రమాదంలో 22 మంది మృతిచెందగా.. వారి వివరాలను గుర్తించినట్టుగా జిల్లా అధికారులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. నేవీ సహాయం కూడా కోరామని తెలిపారు. బోల్తా పడిన పడవలో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉందని చెప్పారు. ఘటన స్థలంలో సహాయక చర్యలను మంత్రులు పీఏ మహ్మద్ రియాస్, వి అబ్దురహిమాన్ సమన్వయం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సంతాప దినం ప్రకటించి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది.